Ys Jagan : అదే జగన్ ధీమా... అందుకే ఎడా పెడా మార్చేస్తున్నారట..అక్కడ మాత్రం కష్టమేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. అందుకే ఆయన ఇన్‌ఛార్జులను మారుస్తున్నారు

Update: 2024-01-18 08:05 GMT

రెండు తెలుగు రాష్ట్రాలూ విడిపోయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలిక ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచన వేరుగా ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం రెండు చోట్ల ఒకటే పరిస్థితి ఉంటుంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈసారి కూడా తనదే అధికారం అన్న ధీమాలో ఉన్నారు. అయితే అందుకోసం నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధపడ్డారు. కొత్త ఇన్‌ఛార్జులను నియమిస్తున్నారు. సామాజికవర్గాల పరంగానే మాత్రమే కాకుండా సీనియర్లను కూడా కొంత పక్కన పెడితేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. అయితే జగన్ కు కొన్ని విషయాల్లో స్పష్టత ఉన్నట్లే కనపడుతుంది.

అర్బన్ ఏరియాలో...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే వైసీపీకి పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్ గా ఉందన్న నమ్మకం ఆయనలో అణువణువునా కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత తేడా ఉన్నట్లు సర్వే నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. అందుకే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువగా మారుస్తున్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమ, తూర్పు, అనకాపల్లి, చిత్తూరు వంటి పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇన్‌ఛార్జులను నియమించారు. రాయదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమ్మిగనూరు, కల్యాణదుర్గం, పెనుకొండ వంటి ప్రాంతాల్లోనూ మరికొన్ని కారణాలతో మార్పులు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్...
తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగైన ఫలితాలను సాధించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం కారు పార్టీ దెబ్బతినింది. మంత్రలుగా పనిచేసిన వాళ్లే ఓటమి పాలయ్యారు. ఆర్థికంగా బలమున్న వాళ్లు, ఎక్కువ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేసిన వాళ్లు కూడా మొన్నటి ఎన్నికల్లో పరాజితులయి పక్కన కూర్చోవాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు ఎదురు తిరిగితే అధికారం రాదన్న విషయం ఈ ఎన్నికల్లో మరో సారి స్పష్టమమయింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువగా వేయకపోవడం కూడా గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. అది పాలన తీరును పెద్దగా ప్రతిబింబంచదు. బీఆర్ఎస్ పాలనపై విసుగుపుట్టిందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని ఏపీ వైసీపీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో...
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతంలో ఫ్యాన్ పార్టీ బలంగా ఉందని చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో పాటు, సంక్షేమ పథకాలు తమ ఇంటివద్దకే రావడం, ఇతర పనులకు ఆటంకం కలగకుండా అన్నీ వాలంటీర్లు చేసిపెడుతుండటంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ వంటి స్కీంలు గ్రామీణుల మెదళ్లలోకి బాగానే చొరబడ్డాయని భావిస్తున్నారు. జగన్ చేయించిన సర్వేల్లోనూ రూరల్ ఏరియాల్లో పట్టున్న పార్టీ అధికారంలోకి వస్తుందని గత ఎన్నికల ఫలితాలు కూడా చెబుతుండటంతోనే జగన్ అభ్యర్థులను మార్చివేస్తున్నారట. అందుకే ఆయన ఎవరినీ లెక్క చేయకుండా గెలుపు అవకాశాలున్నవారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారన్నది పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News