YSRCP : ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే
గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు తమకు టిక్కెట్ దక్కదని భావించి ఇతర పార్టీల వైపు చూస్తుండగా మరికొందరు మాత్రం స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ డిసైడ్ అయి కొన్ని నిర్ణయాలు ప్రకటించిన తర్వాత ఇలాంటి పరిస్థితి అధికార వైసీపీలో నెలకొంది.
వేరే పార్టీలోకి కొందరు...
ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిచి మరీ టిక్కెట్ ఇవ్వలేకపోతున్నట్లు జగన్ చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవప్రదమైన పదవి ఇస్తామని హామీ ఇస్తున్నారు. వీరిలో కొందరు జగన్ మాటలకు కట్టుబడి ఉండగా మరికొందరు మాత్రం గీత దాటేందుకు సిద్ధపడుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ప్రారంభమైన ఈ అలకలు.. జంప్ లు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆయన 2009 లో ప్రజారాజ్యం నుంచి 2019 లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
పోటీ చేయనంటూ....
ఆరోగ్య కారణాల వల్ల 2024 ఎన్నికలకు తాను దూరంగా ఉంటానని అన్నా రాంబాబు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న తాను వైసీపీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న అన్నా రాంబాబు కావాలని కొందరు చేసే దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తొలిసారి తాను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో ఎమ్మెల్యేను అయ్యానని, తన కుటుంబాన్ని కొందరు లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తుండటం తనను కలచి వేస్తుందన్నారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారాంబాబు తెలిపారు.