కేసీఆర్ పోటీ అక్కడి నుంచేనా?.. తెలంగాణలో ఆసక్తికర చర్చ
తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ఈసారి.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు గట్టిపోటీనే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ 'ఆపరేషన్ ఆకర్ష్' పై ప్రధాన దృష్టి పెట్టిందని, ఆగస్టులో కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో కేసీఆర్ గజ్వేల్ నుంచి తప్పుకుంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ పోటీ ఎక్కడ నుంచి అనేదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. 2014, 2018లో గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన కేసీఆర్ ఈసారి నియోజకవర్గాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు.
కేసీఆర్ మూడు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటిది మేడ్చల్ నియోజకవర్గం కాగా ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన రెండు నియోజకవర్గాలు పెద్దపల్లి, కామారెడ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. కేసీఆర్ గెలుపు సునాయాసమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే వీటిలో దేనికైనా కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ తమ సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు కానీ కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంచుకుంటే వారికి వేరే మార్గం ఉండదు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్ రెడ్డి బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని బీఆర్‌ఎస్ అధినేత కోరుకుంటే.. తప్పని పరిస్థితుల్లో తమ సీటును త్యాగం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కేసీఆర్ తన అవకాశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. కొంతమంది నాయకులు బీఆర్‌ఎస్ అధినేతను దక్షిణ తెలంగాణ లేదా ఖమ్మం నుండి పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఇక్కడ పార్టీకి బలమైన అభివృద్ధి అవసరం, వ్యతిరేకత కూడా ఉంది. వచ్చే నెలలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే, కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం తెలుస్తుంది.