చంద్రబాబు గైర్హాజరీలో పార్టీ ఎలా ఉంటుందో అర్థమయిందిగా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లి 37రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో పార్టీ పూర్తిగా పడకేసింది.

Update: 2023-10-16 05:20 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లి 37రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో పార్టీ పూర్తిగా పడకేసింది. జైలుకెళ్లారన్న సింపతీపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తుంది. కనీస కార్యక్రమాలు కూడా చేయడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం తప్ప పార్టీ బలోపేతానికి ఎటువంటి బేస్ ఉన్న కార్యక్రమాలను చేపట్టడం లేదు. నేతలంతా చంద్రబాబు అరెస్ట్‌తో నీరుగారిపోయినట్లే కనిపిస్తుంది. పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం అస్సలు మరిచిపోయినట్లే అనిపిస్తుంది. కేంద్ర పార్టీ కార్యాలయం మాత్రం ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటుందని సమాచారం.

బయట ఉంటే...
చంద్రబాబు బయట ఉంటే పార్టీ పరుగులు తీసేది. అందులో తొలి విడత మ్యానిఫేస్టోను ఆయన ప్రకటించారు. కనీసం ఆయన గైర్హాజరీలో మ్యానిఫేస్టోను అయినా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న యోచన నేతలకు లేదు. ఏదో అరెస్ట్ పై మీడియా సమావేశాలు పెట్టడం మినహా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోవడాన్ని పూర్తిగా మానేశారు. ఒకవైపు అధికారంలో ఉన్న వైసీపీ ఎన్నికలకు సమాయత్తమై కార్యక్రమాల క్యాలెండర్ ను రూపొందించుకుంటే టీడీపీ మాత్రం మీన మేషాలు లెక్కించుకుంటుందన్న కామెంట్స్ బలంగా వినపడుతన్నాయి. చంద్రబాబు బయట లేకపోయినా ఆయనతో ములాఖత్ అయి పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా చేయాల్సిన నేతలు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారనిపిస్తుంది.
ఏది చేపడితే...?
ఏ కార్యక్రమం చేపడితే ఏ సమస్య అని భావించి కావచ్చు. సీనియర్ నేతలు కూడా సలహాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. నియోజకవర్గాల వారీగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితుల్లో మంగళగిరికి, రాజమండ్రికి మాత్రమే నేతలు పరిమితమయ్యారు. దీనికి తోడు జనసేన పొత్తు ఖరారు కావడంతో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తుంది. గెలిచేది తామేనన్న ధోరణిలో ఎక్కువ మంది నేతలున్నారు. ప్రభుత్వం పై వ్యతిరేకత, చంద్రబాబు జైలుకు వెళ్లిన సానుభూతి, జనసేనతో చెలిమి వెరిసి గెలిచేస్తామన్న ధీమాలో టీడీపీ నేతలున్నారు. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఆర్థికంగా...
లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువగా ఉండటం, చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసే పనిని కూడా చేపట్టడం లేదు. ఇప్పటి నుంచే కార్యక్రమాలు చేపట్టి చేతి చమురు ఎందుకు వదిలించుకోవడమన్న ధోరణి నేతల్లో కనిపిస్తుంది. రేపు చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు కాబట్టి అప్పడు చూసుకుందాంలే అన్న ఆలోచనలో ఎక్కువ మంది నేతలున్నారు. నెలరోజుల నుంచి తమ పార్టీ అధినేత జైలులో ఉంటే పార్టీ ఇలా పడకేయడం పట్ల కిందిస్థాయి క్యాడర్ లో మాత్రం పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News