KCR : గేట్లు ఎత్తడం నీకే కాదు బాబాయ్.. వాళ్లకు కూడా అలవాటే.. అర్థమయిందా రాజా?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి. నాడు కేసీఆర్ చూపిన బాటలోనే నేడు కాంగ్రెస్ పయనిస్తుంది
ఇప్పుడు అనుకుని ఏం లాభం..? అవసరం లేకపోయినా.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అనుకున్నప్పుడు ఉండాలి. ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా శాసనసభలో కనపడకుండా చేయాలన్న కుట్రపూరితమైన ఆలోచన చేయకపోతే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. నాయకులది తప్పు కాదు. వాళ్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరతారు. వారికి ఐదేళ్లు పవర్ ఒక్కటే కావాలి. 2014లోనూ, 2018లోనూ నాడు బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతినే నేడు కాంగ్రెస్ అనుసరిస్తుంది. అందులో తప్పుపట్టడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప నాడు కండువాలు కప్పి నేడు వాళ్లు కప్పుతుంటే.. కయ్ కయ్ మని అరుస్తూ.. సుద్దులు చెప్పడాన్ని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
కకావికలం చేసి...
అవును.. తెలంగాణలో తనకు తిరుగులేదని భావించిన కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో పార్టీలను కకావికలం చేయాలని భావించారు. ఇక్కడ బలమున్న పార్టీలను సరే.. బలహీన పార్టీలను కూడా వదిలిపెట్టలేదు. టీడీపీ, వైసీపీలకు ఇక్కడ చోటు లేదని తెలిసినా ఆ పార్టీలో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్నారు. శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో కలిపేసి విజయదరహాసం చేశారు. ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ప్రగతి భవన్ కు రప్పించుకని మరీ వారిని తన పార్టీలోకి రప్పించుకున్నారు. నాయానో, భయానో తెలియదు కానీ.. ఒక దశలో వేరే పార్టీలకు ఓట్లు వేయడం అనవసరమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.
ఓటమి తర్వాత...
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఓటమి తర్వాత తానేంటో ఆయనకు అర్థమయింది. పార్టీ వీడి వెళ్లిన వారిని ఇక చేర్చుకోబోనని ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు గులాబీ బాస్. కానీ బీఆర్ఎస్ లో దొరకని స్వేచ్ఛ కాంగ్రెస్ లో దొరుకుతుందనుకుంటే వాళ్లను ఆపేదెవరు? ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఈ పనిని చేయడం మంచిది కాదు. కానీ దాని అవసరం అలాంటిది. అరకొర మెజారిటీ రావడం, ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే సవాళ్లు విసురుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అది గేట్లు తెరిచేసింది. దీనిని తప్పు పట్టలేని పరిస్థితి.
ఇప్పడు గగ్గోలు పెట్టి...
ప్రజాస్వామ్యం అని ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రయోజనం లేదు. ఆ ఆలోచన గత పదేళ్లలో గులాబీ బాస్ కు ఎందుకు రాలేదు? పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు సుద్దులు చెబుతుండటం చూస్తుంటే... గురిగింజ సామెత గుర్తుకు రాకమానదు. నాడు కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఆ పార్టీలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే.. ఇప్పుడు ఏం మాట్లాడినా కొంత అర్థముండేది. కానీ నాడు నువ్వు చేసిందే.. వాళ్లు నేడు చేస్తున్నారు.. ఇప్పుడు చేయాల్సింది.. మౌనంగా ఉండటం తప్ప ఇంకా ఏది చేసినా జనాలకు కూడా ఏవగింపుగా ఉంటుంది తప్ప మరొకటి కాదన్నది ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. అందుకే అన్నారు.. నీవు నేర్పిన విద్యయే.. అన్న సామెత గులాబీ బాస్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది.