పవన్ రాజకీయ వ్యభిచారి : ఎమ్మెల్యే ద్వారంపూడి
చంద్రబాబుతో పవన్ కు బేరం కుదరక ప్రజల్లోకి వచ్చాడన్నారు. ఎమ్మెల్యే, సీఎం అవ్వాలన్న కోరిక సినిమాల వరకే పరిమితమని..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి వారాహియాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన జనసేన సభలో పవన్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడిపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై ద్వారంపూడి స్పందించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
తాను రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ రెండుసార్లు పోటీ చేసినా గెలవలేకపోయాడని విమర్శించారు. జనసేన పార్టీ పెట్టినపుడు ఉన్నవాళ్లు ఇప్పుడు నీతోనా ఉన్నారా ? అని పవన్ ను ప్రశ్నించారు. జనసేన పార్టీ ఎవరి బాగుకోసం పెట్టావ్? రాష్ట్రం కోసమా.. లేక చంద్రబాబు కోసమా ? అని సూటి ప్రశ్న వేశారు. మద్యం సేవించి జనసేన కార్యకర్తలను దూషించాననడంలో నిజం లేదన్నారు. తనకు ఆల్కాహాల్, సిగరెట్లు కాదు కదా.. కాఫీ, టీ లు తాగే అలవాటు కూడా లేదన్నారు. ఎవరో ఏదో చెప్పారని, దాని ఆధారంగా విమర్శలు చేయడం తగదన్నారు.
చంద్రబాబుతో పవన్ కు బేరం కుదరక ప్రజల్లోకి వచ్చాడన్నారు. ఎమ్మెల్యే, సీఎం అవ్వాలన్న కోరిక సినిమాల వరకే పరిమితమని, నిజజీవితంలో పవన్ రాజకీయాలకు పనికిరాడన్నారు. మీరు విమర్శలు చేస్తే.. మేం అంతకన్నా పెద్దగానే విమర్శలు చేయగలమన్నారు. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యంపై రిపోర్టులు తెప్పించుకోమన్నారు. కాకినాడ పోర్టులో రైస్ వ్యాపారం చేసి 15 వేల కోట్లు సంపాదించారన్న పవన్ వ్యాఖ్యలను ద్వారంపూడి ఖండించారు. కాకినాడ పోర్టులో ఎక్స్ పోర్టు బిజినెస్ విలువే 15 వేల కోట్లు లేవన్నారు. నేను తలచుకుంటే.. కాకినాడలో జనసేన బ్యానర్ కట్టకూడదనుకుంటే కట్టనివ్వను అని తేల్చి చెప్పారు. అందుకోసం ఎవరినీ బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
పవన్ కల్యాణ్ కు ద్వారంపూడి సవాల్ చేశారు. చంద్రబాబును దేహీ దేహీ అని అడుక్కునైనా కాకినాడలో పోటీ చేయాలని.. రాబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి పంపకపోతే నేను చంద్రశేఖర్ రెడ్డే కాదు అని సవాల్ చేశారు. రాబోయే ఎన్నికల్లో నీ అంతు చూస్తానంటూ అల్టిమేటం జారీ చేశారు.