నాడి పట్టిన నేతలు
నేతలు జనం పల్స్ పడతారు. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటారు
నేతలు జనం పల్స్ పడతారు. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటారు. అధికారంలో ఉన్న వారితో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఎప్పటికప్పుడు తాము సొంతంగా సర్వేలు చేయించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువయిపోయింది. ఆ సర్వేల ఫలితాల్లో ఖచ్చితత్వం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే వాటి ఆధారంగానే నేతల నిర్ణయాలుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలయిందనే చెప్పాలి. ఇందుకు నేతల చేరికలే నిదర్శనం. త్వరలో బీజేపీ నుంచి కూడా పెద్ద యెత్తున నేతలు కాంగ్రెస్‌లోకి మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వీరిందరికీ టిక్కెట్ల విషయంలో గ్యారంటీ వస్తే జంప్ చేయడానికి రెడీ అవుతున్నారు.
కొంత కాలం క్రితం వరకూ...
రెండు నెలల వరకూ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థిితి ఏమాత్రం బాగాలేదు. కానీ అనూహ్యంగా పుంజుకుంది. పార్టీపై సింపతీ కావచ్చు. పోనేలే పాపం.. ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే భావన కావచ్చు. ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగింది. పాజిటివ్ వేవ్ బాగా పెరిగింది. ఈ వేవ్ చూసిన తర్వాతనే నేతలు గాంధీభవన్ కు క్యూ కడుతున్నారు. వరసగా వచ్చి కండువాలు కప్పుకుంటూ తమ టిక్కెట్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఎవరో ఒక బలమైన నేత పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెరిగింది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ చేరికలు ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
టిక్కెట్లు రాక...
టిక్కెట్లు దక్కక వచ్చారను కోవచ్చు. కానీ టిక్కెట్లు రాకపోయినంత మాత్రాన కాంగ్రెస్‌లోకే రావాలన్న గ్యారంటీ ఏంది? బీజేపీలోకి వెళ్లవచ్చు కదా? అంటే జనం మూడ్ ను బట్టి వారి కదలికలున్నాయని చెప్పకతప్పదు. వేముల వీరేశం, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నేడు మైనంపల్లి హనుమంతరావు వరకూ చేరికలను చూస్తే అదే అర్థమవుతుంది. రేపో మాపో మరికొందరు నేతలు హస్తం పార్టీ వైపునకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరంతా కాంగ్రెస్ హైకమాండ్ కు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆరు గ్యారంటీలతో...
ప్రధానంగా ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుందనే చెప్పాలి. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళితే గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం నేతల్లో ఏర్పడింది. జనం కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిసి నేతలు కూడా పార్టీలో చేరికకు ఉత్సాహపడుతున్నారు. అధికార పార్టీలో ఉండటం కంటే పార్టీ మారడమే సేఫ్ అని భావించి ఇంకొందరు జంప్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ టిక్కెట్లు ఖరారు చేయకపోవడం వల్లనే చేరికలు కొనసాగుతున్నాయి. ఒక సారి సీట్లను ప్రకటిస్తే ఇక చేరికలుండవని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? జనం మూడ్ మారిందా? లేదా? అన్నది మరికొద్ది నెలల్లో తేలనుంది.