వచ్చే ఎన్నికల్లో కేంద్రం మెడలు వచ్చి దేశాన్ని అభివృద్ధి చేసి తీరుతాం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిచించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ..

Update: 2023-08-08 06:24 GMT

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిచించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అయితే మహారాష్ట్రలోని సోలాపూర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, ఇతర నేతలు సోమవారం తెలంగాణ భవన్‌లో కండువా కప్పుకొన్న సందర్భంగా కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని గెలిపించుకునేందుకు కేసీఆర్‌ వారికి దిశానిర్ధేశం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణలో కలిపి మొత్తం 65 లోక్‌ సభ స్థానాలు ఉన్నాయని, అందులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించినట్లయితే కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదని అన్నారు. దీంతో కేంద్రంలో కూడా మనమే ఉండే పరిస్థితి వస్తుందన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ దేశ రాజకీయాలపై కీలక అడుగులు వేస్తున్నారు. మహారాష్ట్రలో పట్టుసాధించినట్లయితే దేశ వ్యాప్తంగా విస్తరించుకునే అవకాశం ఉంటుందని నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని వారిని కోరారు.

ప్రస్తుతం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా అభివృద్ధి వెనుకబడిపోతుందని, అంబానీ, ఆదానీల ప్రభుత్వం కాదని, రైతులు, పేదల అభివృద్ధి కోసం జరిగే విధంగా ప్రభుత్వం ఉండాలన్నారు. తాము రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవాలని పేర్కొన్నారు.అలాగే మోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు కేసీఆర్‌. అంబానీ, ఆదానీ దేశాన్ని దోచి పెడుతున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్‌లో ఉన్న వనరులన్నీ వారిద్దరికే కట్టబెడుతున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. దేశంలో అవసరమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అయినప్పటికీ ఇతర దేశాలైన ఇండోనేషియా, ఆస్ట్రేలియాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలను అంబానీ, ఆదాలకు అప్పగించి, విద్యుత్‌ బిల్లులను భారీగా పెంచేసి పేదల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.

అలాగే తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, అమలు అవుతున్న పథకాలను మహారాష్ట్రకు చెందిన దాదాపు 20 వేల మంది వచ్చి స్వయంగా పరిశీలించి వెళ్లారని అన్నారు. దేశంలో కొత్త పార్టీ అవతరించే అవసరం ఎంతో ఉందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాల్లో విద్యుత్‌ కష్టాలు లేకుండా చూస్తామని, రైతులు వ్యవసాయాన్ని సాగు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని దించి తీరుతామని అన్నారు. రైతులు, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Tags:    

Similar News