ఆ వెబ్‌సైట్ చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు
ధరణిలో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించింది. వీటిని సరిచేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని..
హైదరాబాద్ : ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఒక వెబ్ పోర్టల్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ వెబ్ పోర్టల్ తమకు ఓట్లు తీసుకువస్తుందని అన్ని పార్టీలు ఆశ పడుతున్నాయి. ఈ వెబ్ పోర్టల్ పట్ల సానుకూలంగా ఉన్న ఓట్లు తమకు పడతాయని అధికార టీఆర్ఎస్ పార్టీ ఆశపడుతోంది. ఇక ఈ పోర్టల్ పట్ల విరక్తి చెందిన వారి ఓట్లు తమకే పడతాయని ప్రతిపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి. అసలు.. రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేస్తున్న ఈ వెబ్ పోర్టల్ ఏంటి ? దీనిపైన పార్టీలు ఎందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి ? వంటివి ఈ కథనంలో చూద్దాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక రెవెన్యూ శాఖపైన ప్రత్యేక దృష్టి సారించారు. పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముందుగా భూరికార్డుల ప్రక్షాళన చేశారు. ఆ తర్వాత ధరణి అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. భూరికార్డులు, భూపరిపాలనకు సంబంధించి ఈ వెబ్‌పోర్టల్ చాలా కీలకమైనది. భూరికార్డులను పరిశీలించుకోవడం, తీసుకోవడం, సమస్యలు ఉంటే దరఖాస్తులు పెట్టుకోవడం, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయించుకోవడం, ఇలా అన్ని భూసంబంధిత వ్యవహారాలు ఈ ధరణి పోర్టల్‌లోతోనే జరుగుతున్నాయి.
అయితే, ఈ వెబ్ పోర్టల్‌లో అనేక సమస్యలు ఉన్నాయి. మూడేళ్లవుతున్నా కూడా ఇంకా ఇది పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రావడం లేదు. పలు రకాల సమస్యలు పరిష్కరించేందుకు ఇందులో ఆప్షన్లు లేవు. దీంతో రైతులు ఇచ్చే దరఖాస్తులను అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. ధరణి పోర్టల్‌లోని భూరికార్డుల్లో అనేక తప్పులు వచ్చాయి. విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. భూయాజమానుల పేర్లు తారుమారయ్యాయి. కొన్ని సర్వే నెంబర్లు మొత్తానికే మిస్ అయ్యాయి.
కొన్ని పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. ఇలా రకరకాల సమస్యలకు ధరణి పోర్టల్ కారణమని రైతులు భావిస్తున్నారు. గతంలో సమస్యలు లేని భూములపైన కూడా ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత సమస్యలు వచ్చాయనే భావన నెలకొంది. ఇప్పుడు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ధరణి ద్వారా వచ్చిన భూసమస్యలు రైతులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. భూములు అమ్మాలనుకునే వారు అమ్మలేకపోతున్నారు.
ధరణిలో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించింది. వీటిని సరిచేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది. ఎప్పటికప్పుడు ఈ వెబ్ పోర్టల్‌లో కొత్త ఆప్షన్లను తీసుకువస్తోంది. రికార్డుల్లో వచ్చిన తప్పులను సరిచేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఆశించిన వేగంగా జరగడం లేదు. దీంతో చాలామంది రైతుల్లో ధరణి పోర్టల్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు కూడా చెపట్టాయి.
ఇప్పుడు కాంగ్రెస్ ఒకడుగు ముందుకేసి అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ధరణిని రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రకటనలను టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఖండిస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ధరణి పోర్టల్‌ను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ధరణి పోర్టల్‌లో లోపాలన్నీ సరిదిద్దిన తర్వాత దీని పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. కానీ, ధరణిని రద్దు చేస్తామన్న ప్రకటన తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తంగా, ఒక వెబ్‌పోర్టల్ ఎన్నికల అంశం కావడం మాత్రం ఆసక్తికర అంశమే.