Komatireddy Venkatareddy : కుదురుగా ఉండవా కోమటిరెడ్డన్నా... ఇలా అయితే ఇక అంతే
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరసగా చేస్తున్న ట్వీట్లపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత ఏర్పాటయింది. అందుకు కాంగ్రెస్ కార్యకర్త నుంచి నేతల వరకూ ప్రతి ఒక్కరూ పండగ చేసుకున్నారు. పదేళ్ల తర్వాత చేతికి అధికారం వచ్చింది చాలు అని సంతృప్తి పడుతున్నారు. పదేళ్లుగా శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయిన నేతలు మాత్రం మనకు ఐదేళ్లు పండగేనని భావిస్తున్నారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపించి హైకమాండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని నేతలు భావించాల్సి ఉంటుంది. ప్రజల మనసు మారడానికి ఎంతో సమయం పట్టదు. అందుకు ఒక రోజు కూడా సరిపోతుంది. అది తెలియకుండా మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు చేస్తున్న వరస ట్వీట్లు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
సీనియర్ నేతగా....
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత. ఆయన సామాజికవర్గం పరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా బలమైన నేత. అయితే ఆయన కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కావాలని భావించి ఉండవచ్చు. అందులో తప్పు లేదు కూడా. కానీ హైకమాండ్ నిర్ణయం మాత్రం రేవంత్ రెడ్డివైపేనే ఉండటంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అందులో కుదురుగా ఉండాల్సిన ఆయన పార్టీని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే విధంగా ట్వీట్లు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.
భట్టితో ఫొటో పెట్టి...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారు. అది డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఉన్న ఫొటోను పెట్టి నవశకానికి నాంది అని క్యాప్షన్ జోడించారు. దీనిపై చర్చ జరిగింది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు కోమటిరెడ్డి నయా ప్లాన్ అంటూ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు విమర్శలకు దిగాయి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేసిన ఉద్దేశ్యం మాత్రం బయటపెట్టలేదు. దీంతో అందరూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఈ ట్వీట్ చేశారా? అన్న అనుమానాలు బలంగా బయలుదేరాయి. లేకపోతే అనవసర సమయంలో అనవసర కామెంట్స్ చేయడమెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమని నెల రోజులు కాకముందే ఈ గోలేంటి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా ట్వీట్ తో...
అంతటితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వదిలిపెట్టలేదు. ఈరోజు కూడా మరో ట్వీట్ చేసి చర్చకు దారి తీశారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను కలసి ఉన్న ఫొటోతో ట్వీట్ చేశారు. త్యాగం ఒకడు.. వేగం ఒకడు అంటూ క్యాప్షన్ జోడించారు. అంటే తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటూనే.. వేగంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆయనపై విమర్శలు చేశారా? సెటైర్లు వేశారా? లేక పాజిటివ్ గానే ఈ ట్వీట్ చేశారా? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. అయితే వరస ట్వీట్లకు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెబితేనే అసలు విషయం బయటకు వస్తుంది. లేకుంటే ఎవరికి వారే తమకు తోచిన రీతిలో తాము అన్వయించుకునే అవకాశాలు లేకపోలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికల వేళ కొందరు బాధ్యత గలిగిన నేతలు కార్యకర్తలకు, ప్రజలకు అర్థమయ్యేలా వ్యవహరిస్తే మంచిదంటున్నారు.