Pawan : రెండుసీట్లు అయితే ప్రకటించారు కానీ.. అది ఆల్రెడీ డిసైడ్ అయ్యాయంటగా జానీ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన రెండు సీట్లపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన రెండు సీట్లపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. రాజోలు, రాజానగరం సీట్లలో తాము పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది. రిపబ్లిక్ డే రోజున ఆర్ అక్షరంతో వచ్చే రెండు స్థానాలను ప్రకటించారు. సరే.. రాజోలులో గత ఎన్నికల్లో జనసేన గెలిచింది. అక్కడ టీడీపీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఎటొచ్చీ.. రాజానగరంలోనే ఇబ్బంది ఎదురవుతుందా? అంటే లేదనే సమాధానం వస్తుంది. రాజానగరంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా 2009లో రాజానగరం శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి రెండు ఎన్నికల్లో టీడీపీ అక్కడ విజయం సాధించింది. కానీ ఆ సీటును జనసేనకు ఇవ్వాలన్న నిర్ణయం జరిగిపోయిందంటున్నారు.
రెండుసార్లు టీడీపీ...
అంటే అక్కడ టీడీపీ బలంగానే ఉన్నట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో జరిగినప్పుడు అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెందుర్తి వెంకటేశ్ గెలుపొందారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 లోనూ అదే నియోజకవర్గం నుంచి పెందుర్తి వెంకటేశ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం అక్కడ వైసీపీ గెలిచింది. రాజానగరం నుంచి జక్కంపూడి రాజా పోటీ చేసి దాదాపు ముప్ఫయి వేల మెజారిటీతో పెందుర్తి వెంకటేశ్ ఓడిపోవడంతో పార్టీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయనపై పార్టీ క్యాడర్ కూడా కొంత అసహనంతో ఉంది. పెందుర్తి వెంకటేశ్ ను ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ టీడీపీ క్యాడర్ నుంచి వినపడుతుంది.
తొలి నుంచి...
అయితే పెందుర్తి వెంకటేశ్ కుటుంబం తొలి నుంచి టీడీపీలోనే ఉంది. ఆ కుటుంబానికి చెందిన సాంబశివరావు ఎన్టీఆర్ హయాంలోనూ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989లో ఆయన పక్కకు తప్పకోగా ఆయన వారసుడిగా వెంకటేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వెంకటేశ్ కు టీడీపీ మద్దతుగా నిలుస్తుందనుకున్నా, ఆయన ప్రత్యేకంగా తనకంటూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని వారినే ప్రోత్సహిస్తుండటంతో మిగిలిన పార్టీ నేతలకు కంటగింపుగా తయారయింది. అయితే కొత్త నేతకు ఇచ్చే కంటే పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తేనే బెటర్ అని టీడీపీ ఎప్పుడో రాజానగరం విషయంలో డిసైడ్ అయినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం, రాజోలు నియోజకవర్గాలు జనసేనకు కేటాయించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు.
రాజోలు అంతే...
రాజోలు విషయానికి వస్తే ఎటూ గత ఎన్నికల్లో జనసేన గెలిచిన సీటు కాబట్టి ఈసారి కూడా దానిని ఆ పార్టీకే కేటాయిస్తారు. అక్కడ ఆ పార్టీకి బలం ఉంది. బొంతు రాజేశ్వరరావును ఆ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. రాపాక వరప్రసాదరావు వైసీపీ మద్దతుదారుగా మారగా, బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరిపోయారు. దీంతో ఆయనకు ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు సీట్లు జనసేనాని ప్రకటించారని, దాని వల్ల తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ యా నియోజకవర్గాలలో కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏవీ లేవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద పవన్ ప్రకటించిన రెడు సీట్లు టీడీపీ ఎప్పుడో జనసేనకు ఇవ్వాలని డిసైడ్ చేసినవేనని తమ్ముళ్లు చెబుతున్నారు.