Kesineni Nani : కేశినేని ఫస్ట్ విక్టరీ కొట్టేశారుగా.. అనుకున్నది సాధించినట్లేనా?
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైసీపీలో తొలి విజయం సాధించారు. తిరువూరు టిక్కెట్ స్వామిదాసుకు ఇప్పించుకోగలిగారు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైసీపీలో తొలి విజయం సాధించారు. తనకు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ ఖరారు చేసుకోవడంతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు కూడా సీటును ఇప్పించుకున్నారు. దీంతో ఆయన చెప్పిన వాళ్లకు నాలగో జాబితాలో సీటు కన్ఫర్మ్ అయిందనే అనుకోవాల్సి ఉంటుంది. నల్లగట్ల స్వామిదాసు తొలి నుంచి కేశినేని నానికి అనుకూలంగా ఉండేవారు. తిరువూరు నియోజకవర్గంలో ఆయన ప్రతినిధిగా పదేళ్ల నుంచి వ్యవహరిస్తూనే ఉన్నారు. విజయవాడ ఎంపీగా కేశినేని నాని, తిరువూరులో ఆయన ప్రతినిధిగా స్వామిదాసులు టీడీపీ కోసం పనిచేశారు.
చివరి గెలుపు...
1994, 1999 ఎన్నికల్లో వరసగా తిరువూరు నుంచి గెలిచిన నలగట్ల స్వామిదాసుకు ఆ తర్వాత మాత్రం గెలుపు పిలుపు వినిపించలేదు. అయినా ఆయన పార్టీలోనే ఉండిపోయారు. 2014లో ఆయన టీడీపీ అభ్యర్థిగా తిరువూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనను కాదని అప్పటి మంత్రి జవహర్ ను తిరువూరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయించారు. దీంతో ఆయనకు మరోసారి పోటీ చేసే అవకాశం రాలేదు. తాజాగా ఈ ఎన్నికల్లోనూ దేవదత్ ను తిరువూరు ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించడంతో ఆయనకు టిక్కెట్ లేదని తేలిపోయింది. అయితే కేశినేని నాని మాత్రం స్వామిదాసుకు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.
నాని సిఫార్సుతోనే...
కేశినేని నాని అనుచరుడుగా ఉండటం వల్లనే స్వామిదాసును తప్పించారన్న వాదనలో కూడా కొంత నిజముంది. అయితే ఇటీవల కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత స్వామి దాసు కూడా ఆయన వెంటే నడిచారు. జగన్ తో జరిగిన సమావేశంలో తనతో పాటు స్వామిదాసుకు తిరువూరు టిక్కెట్ ఇస్తే తాను గెలిపించుకుని వస్తానని నాని హామీ ఇచ్చినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. ఆ మేరకే నాలుగో జాబితాలో స్వామిదాసు పేరు ఖరారయింది. నిన్న మొన్నటి వరకూ ఆయనకు టిక్కెట్ వస్తుందోనన్న అనుమానం ఉంది. అయితే జాబితాలో చోటు దక్కడంతో స్వామిదాసు అనుచరులు తిరువూరులో పండగ చేసుకున్నారు.
సహకారం దొరుకుతుందా?
దాదాపు రెండు దశాబ్దాలుగా చట్టసభలకు స్వామి దాసు దూరంగా ఉన్నారు. ఈసారి అధికార పార్టీ టిక్కెట్ లభించింది. తిరువూరులో వైసీపీ బలంగా ఉండటం కొంత అనుకూలించే అంశమే అయినప్పటికీ, ఆయనకు పార్టీ నేతల నుంచి ఎంత మేరకు సహకారం ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణ నిధి ఆయనకు మద్దతుగా నిలుస్తారా? అన్నది కూడా సందేహమే. ఎందుకంటే రక్షణనిధి ఇప్పటికే టిక్కెట్ రాదని తెలిసి పక్క చూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే రక్షణనిధి టీడీపీలోకి వెళ్లినా ఆయనకు సీటు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పార్టీ ఇన్ ఛార్జి ఉండటంతో ఇప్పుడు రక్షణ నిధి ఏం చేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగానే మారింది.