TDP : చంద్రబాబు వెనక్కు తగ్గారా? వేచి చూస్తున్నారా? వైసీపీకి షాక్ ఇవ్వనున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీకి షాక్ ఇవ్వనున్నారా? సమయం కోసం వేచి చూస్తున్నారా? అన్నచర్చ జరుగుతుంది

Update: 2024-02-14 08:25 GMT

రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు కేవలం గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు నామినేషన్లకు ఆఖరి తేదీ. ఇప్పటి వరకూ వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభకు నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పదిహేనో తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు. వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి, గొల్లబాబూరావులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తారని భావించారు. రాజ్యసభలో పూర్తిగా జీరోకు చేరుకుంటుండటంతో టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నుంచి కూడా కొంత మేర సంకేతాలు అందాయి.

క్రాస్ ఓటింగ్ జరిగి....
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈసారి కూడా అదే తరహాలో క్రాస్ ఓటింగ్ జరిగి తమ పార్టీ అభ్యర్థి నెగ్గుతారని టీడీపీ అంచనాగా వినిపించింది. కొన్ని పేర్లు కూడా వినిపించాయి. వర్ల రామయ్య, కోనేరు సురేష్ పేర్లు వినిపించాయి. గత రాజ్యసభ ఎన్నికల్లోనూ వర్ల రామయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి పరిస్థితి వేరు. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తన పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. కొందరికి టిక్కెట్ ఇవ్వనని చెప్పేశారు. మరికొందరికి వేరే నియోజకవర్గాలకు బదిలీ చేశారు. ఈ పరిస్థితుల్లో అసంతృప్తులు తమ వైపునకు వస్తారని టీడీపీ అంచనా వేసింది.
పెద్ద సంఖ్యలో మద్దతు...
అయితే పెద్ద స్థాయిలో మాత్రం అసంతృప్తులు కనపడలేదు. ఒకరిద్దరు రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలంటే నలుగురైదుగురు క్రాస్ ఓటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ రాజ్యసభ ఎన్నికలు మాత్రం అలా కాదు. ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీకి ఉంది 18 మాత్రమే. 23 మంది విజయం సాధిస్తే నలుగురు వైసీపీ వైపు వెళ్లిపోగా, గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమయింది. దీంతో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రావడంతో ఇంకా 19 మంది సభ్యుల సపోర్ట్ అవసరం.
అనర్హత కత్తి...
మరోవైపు స్పీకర్ వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఒకవేళ అభ్యర్థిని ప్రకటిస్తే స్పీకర్ తక్షణం నిర్ణయం తీసుకుంటారని వేచి చూస్తున్నారా? లేక అసలు రాజ్యసభ రేసులో ఉండకూడదని నిర్ణయించుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఉండవల్లిలోనే ఉన్న చంద్రబాబు దీనిపై కసరత్తులు చేస్తున్నారా? అన్న అనుమానం కూడా ఉంది. చివరి నిమిషంలో అభ్యర్ధిని ప్రకటించి వైసీపీకి షాక్ ఇస్తారా? అన్న సందేహం కూడా ఉంది. మరోవైపు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం వేస్ట్ అని భావించారా? అన్నది కూడా తెలియరాలేదు. ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉండటంతో రేపు నామినేషన్ దాఖలు చేస్తే సరి. లేకుంటే వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. మరి రేపటి లోగా ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News