YSRCP : ఏడో లిస్ట్ రెడీ అయిందా.. ఈసారి తొలగించేది వీళ్లనేనా? వైసీపీలో హాట్ టాపిక్

వైసీపీ ఏడో జాబితా సిద్ధం చేస్తుంది. ఈ మేరకు వైఎస్ జగన్ కసరత్తులు పూర్తి చేశారు;

Update: 2024-02-10 11:33 GMT

వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికలకు తాము సిద్ధం అంటూ ఇప్పటికే ప్రకటించింది. అనేక చోట్ల అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకూ ఆరు జాబితాలను విడుదల చేసింది. ఏడో జాబితాపై గత కొద్ది రోజులుగా తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాయలంలో ఉన్న నేతలు కసరత్తులు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వైఎస్ జగన్ కు నివేదిక అందిస్తున్నారు. నాలుగు రకాల సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఐప్యాక్ తో పాటు మరో రెండు జాతీయ సంస్థలకు సర్వే బాధ్యతను అప్పగించారు. మరొకటి సొంత మీడియా సంస్థ నుంచి కూడా సర్వే చేయించి నివేదికను జగన్ ప్రత్యేకంగా తెప్పించుకున్నట్లు సమాచారం.

మార్పులు..చేర్పులు చేస్తూ....
ఇప్పటి వరకూ దాదాపు 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పద్దెనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేశారు. కొందరికి టిక్కెట్లను నిరాకరించగా, మరికొందరిని పార్లమెంటు సభ్యులుగా పంపారు. ఇంకొదరికి రాజ్యసభకు ఎంపిక చేశారు. మరికొందరికి శాసనసభ నియోజకవర్గాలను మార్చారు. ఇలా అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తున్న జగన్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఏమాత్రం వ్యతిరేకత లేని వారిని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నారు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకోదలుచుకోలేదు. అందుకే తనను నమ్మమని, టిక్కెట్ దక్కని వారందరికీ తాను న్యాయంచేస్తానని జగన్ స్వయంగా టిక్కెట్ దక్కని నేతలకు చెబుతుండటం విశేషం.
కొద్ది పాటి వ్యతిరేకత కూడా...
సంక్షేమ కార్యక్రమాల పట్ల గ్రౌండ్ లెవెల్లో కొంత సానుకూల పరిస్థితులే ఉన్నా స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న కొద్ది పాటి వ్యతిరేకతను కూడా ఆయన ఉండకూడదని భావిస్తున్నారు. తక్కువ మార్జిన్ లో గత ఎన్నికల్లో అనేక మంది ఓడిపోయారని, అలాగే గెలిచిన వారు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టిక్కెట్ దక్కని నేతలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వారికి ఊరటకలిగించేలా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకూ ఎక్కువగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులను మార్చిన జగన్ ఏడో జాబితాలో ఉత్తరాంధ్రపై కూడా ఫోకస్ పెట్టారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ ప్రాంతానికి చెందిన...
ఏడో జాబితాలో కూడా రాయలసీమకు చెందిన కొన్ని ముఖ్య నియోజకవర్గాలున్నాయని చెబుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా సెవన్త్ లిస్ట్‌లో ఛేంజెస్ ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే ఏడో జాబితాను ఓకే చేస్తారని చెబుతున్నారు. రేపో, ఎల్లుండో ఏడో జాబితాను బయటకు విడుదల చేసే అవకాశముందని కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ఆరు జాబితాల్లో తమ పేరు లేదని ఆనందంతో ఉన్న నేతల్లో టెన్షన్ మొదలయింది. ఎక్కడ తమ పేరు ఉంటుందోనని ఉగ్గబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు రాకుంటే చాలునని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.


Tags:    

Similar News