నాగ వైష్ణవి కేసులో కోర్టు సంచలన తీర్పు

Update: 2018-06-14 08:47 GMT

సరిగ్గా ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పంది వెంకట్రావు, మొర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీశ్ లకు యావజ్జీవ ఖైదు విదించింది కోర్టు. అత్యంత నీచమైన, ఆరుదైన నేరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2010 జనవరి 10న నాగవైష్ణవి పాఠశాలకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు డ్రైవర్ లక్ష్మణ్ రావును చంపి నాగవైష్ణవిని, ఆమె సోదరుడు తేజని కిడ్నాప్ చేశారు. తేజ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకోగా నాగవైష్ణవి గుంటూరు వెళ్లే మార్గంలో హత్య చేసి ఇనుమును కరిగించే యంత్రంలో వేసి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ ఘటన తెలిసిన తట్టుకోలేకపోయిన ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ రావు గుండెపోటుతో మరణించారు. ముద్దులొలికే చిన్నారిని అతికిరాతంగా హతమార్చడం, తండ్రి కూడా గుండెపోటుతో మరణించడం అప్పట్లో తీవ్ర సంచలం సృష్టించింది. కేవలం వారి, బంధువులు, కుటుంబసభ్యులే కాదు, ఈ ఘటనను టీవీలో చూసిన ప్రజలు సైతం కంటతడి పెట్టారు.

ఘటన నేపథ్యం....

నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్ రావు మేనరికంతో చేసుకున్న మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు ఆరుగురు మగపిల్లలు తల్లిదండ్రుల మేనరికం వల్ల ఆంగవైకల్యంతో పుట్టి చనిపోవడంతో ఆయన పిల్లల కోసం బంధువు నర్మాదదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే నాగవైష్ణవి. అయితే, ప్రభాకర్ రావు ఎక్కువగా చిన్న భార్య, పిల్లల వద్దే ఉంటుండటం, ఆస్తి కూడా వీరికే ఇస్తున్నారని కక్ష పెంచుకున్న మొదటి భార్య సోదరుడు వెంకట్ రావు, తన స్నేహితులు శ్రీనివాస్, జగదీశ్ లతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై వేగంగా విచారణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఎనిమిదిన్నర ఏళ్లు పట్టింది. చివరకు గురువారం ముగ్గురు నిందితులను దోషులుగా తేలుస్తూ విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది.

Similar News