ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వైసీపీ సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన కొండపిలో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, 2014లో ఈ సీటును కైవసం చేసుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు. 5 వేల ఓట్ల తేడాతో వైసీపీ ఇక్కడ ఓడిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా ఇక్కడ పాగా వేయాలని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి వైసీపీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ వల్ల పార్టీ పరువు మంటగలుస్తోందని సొంత పార్టీలోనే కుంపటి రాజుకుంది. ఆయన ఉంటే తాము పనిచేయలేమని కొంత మంది నాయకులు పార్టీ అధినేతకు తేల్చి చెప్పారు. ఆయన తీరు వల్ల పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుందని కూడా పార్టీ పెద్దలతో పాటు పార్టీ అధినేత జగన్‌కు ఫిర్యాదు చేశారు.
తప్పించాల్సిందేనంటూ.....
పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ పాగా వేయడం సాధ్యం కాదని వారు తేల్చేశారట. దీంతో అశోక్‌ను ఇన్‌ఛార్జిగా తప్పించి.. మరెవరికైనా బాధ్యతలు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనాయకులు, కార్యకర్తలు.. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జూపూడి ప్రభాకర్‌రావు పోటీ చేశారు. అయితే ఆయన గెలిస్తే...తమకు ఇబ్బంది అవుతుందని కొంత మంది పార్టీ పెద్దలు.. ఆయనను తెర వెనుక నుంచి ఓడించి...పార్టీని దెబ్బతీశారు. దీంతో...జూపూడి తీవ్ర ఆవేదన చెంది..పార్టీకి గుడ్‌బై చెప్పి..టీడీపీలోకి చేరిపోయారు. ఇప్పుడు ఆయన ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ గా ఉన్నారు.
లైట్ గా తీసుకోవడంతో.....
జూపూడి టీడీపీలోకి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి నియోజకవర్గ బాధ్యతలను అశోక్ చూస్తున్నారు. అయితే గత నాలుగేళ్ల నుంచి పార్టీ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేకపోయింది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నవరత్నాలు, ఇంటింటికీ వైసీపీ వంటి కార్యక్రమాల నిర్వహణను అశోక్ లైట్‌గా తీసుకున్నాడు. పార్టీకి ఇక్కడ బలమైన ఓటుబ్యాంక్ ఉంది. కానీ దాన్ని అశోక్ తనకు, పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదన బలంగానే వినిపిస్తోంది.
రెండు వర్గాలుగా విడిపోయి.....
అధికార టీడీపీలో నెలకొన్న అసంతృప్తిని, గొడవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అశోక్.. ఆ పనిచేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో పార్టీకి మేలు జరగకపోగా.. కీడే ఎక్కువగా జరుగుతోందన్నది స్థానిక వైసీపీ నేతల వాదన ఈ నేపథ్యంలోనే ఆయనను తప్పించాలని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇక నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న రెండు వర్గాల్లో ఓ వర్గం అశోక్‌ను సమర్థిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. కొండపిలో గెలుపు ఓటములను డిసైడ్ చేసేది... ఇక్కడ రాజకీయాన్ని నడిపేది కమ్మ సామాజికవర్గమే. నియోజకవర్గంలో వైసీపీ మండల పార్టీల అధ్యక్షులు అందరూ కూడా కమ్మ వర్గానికి చెందిన వారే.
వ్యతిరేక వర్గం బలంగా.....
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎస్సీ వర్గానికి చెందిన అశోక్ భార్య కమ్మ వర్గానికి చెందిన వారు. దీంతో ఈ ఈక్వేషన్‌తో ఎస్సీ + కమ్మ ఓటు బ్యాంకును కొల్లగొట్టవచ్చన్నది వైసీపీ ప్లాన్. ఇక బాపట్ల ఎంపీ సీటు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వరికూటి అమృతపాణికి అశోక్ స్వయానా సోదరుడు. ఇవన్నీ అశోక్‌కు సానుకూలంగా ఉన్నా... నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకవర్గం బలంగా ఉండడంతో ఆయనకు మైనస్‌గా మారింది. ఏదేమైనా అశోక్ యాంటీ వర్గం ఆయన్ను ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించే ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ అయినట్టు టాక్. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో ? చూడాలి.