Working for 104 days: అతిగా పని చేస్తే ఇంతే గతా?

ఒకే ఒక్క రోజు సెలవు తీసుకుని వరుసగా 104 రోజులు

Update: 2024-09-09 12:31 GMT

30 ఏళ్ల చైనీస్ వ్యక్తి ఒకే ఒక్క రోజు సెలవు తీసుకుని వరుసగా 104 రోజులు పనిచేశాడు. దీంతో అతడికి అవయవ వైఫల్యం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అతని మరణానికి 20 శాతం యజమానే కారణమని కోర్టు తీర్పు చెప్పింది. వృత్తిరీత్యా పెయింటర్ అయిన అబావో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు గురై మరణించాడు. జూన్ 2023లో అతడు మరణించాడని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.

అబావో పని చేస్తున్న కంపెనీ ఓ ప్రాజెక్ట్‌ పై సంతకం చేసింది. డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో కంపెనీ పాపం అతడితో విపరీతంగా పనిచేయించుకుంది. అతని మీద సంస్థ కనీసం కనికరం చూపలేదు. అతను ఫిబ్రవరి నుండి మే వరకు ప్రతిరోజూ పనిచేశాడు. కేవలం ఏప్రిల్ 6న ఒక రోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. మే 25న అనారోగ్యంతో సెలవు తీసుకున్న తర్వాత, అతని ఆరోగ్యం వేగంగా క్షీణించింది. మే 28న అతను ఆసుపత్రిలో చేరాడు. న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వైఫల్యంతో బాధపడిన అబావో జూన్ 1న మరణించాడు.

అతని మరణం తరువాత, అబావో కుటుంబం అతని యజమానిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎదురైన పరిస్థితులు అతని మరణానికి కారణం అయ్యాయని కుటుంబం వాదించింది. అయితే ఈ విషయం కంపెనీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. అబావో పనివేళలు సహేతుకమైనవని, అదనంగా అతడు పని చేయడం అతడి ఇష్టం మాత్రమేనని తెలిపింది. అయితే కోర్టు మాత్రం అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని నిర్ధారించింది. 104-రోజుల పాటూ పని చేయించుకోవడం అనేది చైనీస్ లేబర్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్లు తెలిపింది. నివేదిక ప్రకారం న్యాయస్థానం అబావో కుటుంబానికి 4,00,000 యువాన్లు (సుమారు రూ. 47,46,000), మానసిక క్షోభకు సంబంధించి 10,000 యువాన్లను (సుమారు రూ. 1,17,000) ఇవ్వాలని సూచించింది.


Tags:    

Similar News