ఎన్టీఆర్ నాణెం కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?

నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Update: 2023-08-29 03:34 GMT

నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంద రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. నందమూరి కుటుంబసభ్యుల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నాణెం 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే పలువురు ప్రముఖులకు సంబంధించి స్మారక నాణేలను విడుదల చేసింది. అయితే ఈ ప్రత్యేక నాణేలు కొనడం అంత సులువు కాదు.

ఎన్టీఆర్ బొమ్మతో నాణెం విడుదల కావడంతో దీన్ని కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణేలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తోంది. ఎన్టీఆర్ నాణెంతో సహా స్మారక నాణేలను www.indiagovtmint.in వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ.4850గా నిర్ణయించారు. ఈ నాణేలు పసుపు, గోధుమ రంగులలో లభిస్తాయి. ఈ సైట్‌లో బంగారం, వెండి నాణేలు కూడా అమ్ముడవుతాయి. హైదరాబాద్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా సైఫాబాద్‌లోని మింట్ సేల్ కౌంటర్‌లో కొనుగోలు చేయవచ్చు. చర్లపల్లిలోని ఐజీ మింట్ సేల్ కౌంటర్‌లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ముద్రించిన నాణాలను 29వ తేదీ నుంచి విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ మింట్‌ కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్‌ చర్లపల్లిలో ఉన్న మింట్ కాంపౌండ్‌లో నేరుగా నాణాలను విక్రయించనున్నట్లు చీఫ్‌ జనరల్ మేనేజర్‌ విఎన్‌ఆర్‌ నాయుడు తెలిపారు. తొలి విడతలో 12వేల నాణాలను అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాలకు మింట్ ఫైనాన్స్ విభాగం మేనేజర్‌ డి.సాంబశివరావు 9885299033లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరికి నాణాలను కొనుగోలు చేసేందుకు వీలుగా డిమాండ్‌కు అనుగుణంగా నాణాల కేటాయింపు చేస్తామని.. ప్రతి ఒక్కరికి పరిమిత సంఖ్యలోనే నాణాలను కేటాయిస్తామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News