Pawan Kalyan : పవన్ ఫిక్స్ అయిన సీట్లు ఇవేనట.. ఆయన కామెంట్స్‌ను బట్టే అర్థమవుతుందిగా
పవన్ కల్యాణ్ క్లారిటీతో ఉన్నట్లున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా సీట్ల విషయంలో మెత్తబడే పరిస్థితి కనిపించడం లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్లు క్లారిటీతో ఉన్నట్లే కనపడుతుంది. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నా సీట్ల విషయంలో మెత్తబడే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఆయన చేసిన వ్యాఖ్యలే కారణంగా చూడాలి. రాజమండ్రిలో జనసేన నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కొంత కలవరం రేపుతున్నాయి. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే నలభై స్థానాలలో గెలుస్తామని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన అన్ని స్థానాలకే ఫిక్స్ అయినట్లు కనపడుతుంది. అంతకంటే తక్కవ స్థానాలను ఆయన కోరుకోవడం లేదని తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేసినా జనసేన నలభై ప్థానాల్లో గెలుస్తామని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని పవన్ కల్యాణ్ అనడం పై టీడీపీలో చర్చ జరుగుతుంది.
అక్కడే ఎక్కువగా....
ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని కూడా పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ జనసేన నలభై స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతంుది. పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించడంతో పాటు గత ఎన్నికల ఫలితాలు, 2009లో ప్రజారాజ్యం పోటీ చేసిన స్థానాలు ఇలా అన్ని రకాలుగా అంచనాలు వేసుకుని మరీ ఒక అంకెను ఆయన అనుకున్నారు. ఆ అంకెకు తగ్గకుండా టీడీపీ నుంచి జనసేనకు తీసుకోవాలన్న ఆలోచనతో జనసేనాని ఉన్నట్లే తెలుస్తోంది. అందుకే ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అన్ని జిల్లాల్లో ఉండేలా...
మరొక వైపు సీనియర్ నేత హరిరామ జోగయ్య కూడా దాదాపు ఇదే సంఖ్యను చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య గతంలో చర్చలు జరిగినప్పుడు ఈ అంకె ఊగిసలాడినట్లు తెలిసింది. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నలభై స్థానాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అత్యధికంగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే పోటీ చేయాలని, రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసి భవిష్యత్ లో పార్టీ విస్తరణకు లాభదాయకంగా ఉంటుందన్న అంచనాతోనే పొత్తులకు పవన్ సిద్ధమయ్యారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
జాగ్రత్తగా జాబితా....
అదే సమయంలో రాష్ట్రంలోని పాత పదమూడు జిల్లాల్లో పోటీ చేసేలా కూడా పవన్ కొన్ని స్థానాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఏ జిల్లాలోనూ జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా ఉండేలా ఆయన జాగ్రత్త తీసుకుని జాబితాను రూపొందించారని సమాచారం. చంద్రబాబు వద్ద పలు దఫాలు జరిగిన చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా అంకెను టీడీపీ చీఫ్ ముందు ఉంచినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు కానీ, జనసేనకు ఎన్ని స్థానాలు అన్నది మాత్రం బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. పవన్ ఈరోజు లేదా రేపు ఢిల్లీ వెళ్లి పొత్తులపై చర్చించనున్నారు. టీడీపీ మాత్రం పాతిక సీట్లతో సర్దిపెడతామని భావించినా పవన్ మాత్రం ఇందుకు అంగీకరించే అవకాశాలు ఎంత మాత్రం లేవన్నది పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.