YSRCP : రాజుగారికి పోటీ ఈమె.. మరి నెగ్గుకు రాగలదంటారా? జగన్ సోషల్ ఇంజినీరింగ్ వర్క్‌అవుట్ అవుతుందా?
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా వైఎస్ జగన్ ఉమాబాలను నియమించారు
వైసీపీ అధినేత జగన్ తాజాగా రిలీజ్ చేసిన ఆ పార్టీ ఆరో లిస్టులో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు షాకులు ఇచ్చారు. ఇంతకుముందు జాబితాల్లో వచ్చిన పేర్లను మళ్లీ మార్చేశారు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి ప్రముఖ డాక్టర్ అనసూరి పద్మలత పేరు ఇంతకుముందు ప్రకటించారు. ఆమె బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే తాజా లిస్టుతో ఆమెకు బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె ప్లేస్‌లో అదే శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఓ మహిళకు నరసాపురం పార్లమెంటులో అవకాశం ఇచ్చారు. నరసాపురం పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా గూడూరి ఉమాబాలను నియమించారు.
రంగరాజుకు ఇద్దామనుకున్నా...
జగన్ నరసాపురం పార్లమెంటు సీటు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన జీవీకే రంగరాజును పోటీ చేయాలని కోరారు ఆయన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు. ప్రస్తుతం ఈ పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. ఈ సీటు నుంచి వైసీపీ తరపున గత ఎన్నికల్లోనూ క్షత్రియ వర్గానికే చెందిన రఘురామ కృష్ణంరాజు గెలిచి ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఈ సారి అదే ఈక్వేషన్‌తో వెళ్లాలని జగన్ అనుకున్నా రంగరాజు ఒప్పుకోలేదు.
తొలి సారి శెట్టి బలిజలకు...
దీంతో జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ పాటించి ఈ సీటును ప్రధాన పార్టీల తరపున ఫస్ట్ టైం శెట్టిబలిజలకు కేటాయించారు. గతంలో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే కమ్యూనిటీ నుంచి గుబ్బల తమ్మయ్యకు ( మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావ) సీటు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు జగన్ అదే కమ్యూనిటీ నుంచి ఓ మహిళకు అవకాశం ఇవ్వడం విశేషం. విచిత్రం ఏంటంటే నరసాపురం, రాజమహేంద్రవరం రెండు లోక్‌సభ సీట్లలో ఒక సీటు శెట్టిబలిజలకు ఇవ్వాలని జగన్ అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా రెండు సీట్లు ఇదే కమ్యూనిటికి ఇచ్చారు.
రఘురామను ఎదుర్కొనే....
రాజమండ్రిలో అనసూరి పద్మలత స్థానంలో కొద్ది రోజల వరకు రాజమండ్రి సిటీ వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌కు అక్కడ పార్లమెంటు సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు. ఇక నరసాపురం సమన్వయకర్తగా వచ్చిన గూడూరి ఉమాబాల భీమవరం పట్టణానికి చెందిన వారు. ఈ కుటుంబానికి గతంలో రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. జగన్ ఆరో లిస్టులో చేసిన తారుమార్ తక్కెడమార్‌లో ఓ శెట్టిబలిజ మహిళ పద్మలతో రాజమండ్రిలో సీటు కోల్పోగా అదే శెట్టిబలిజ మహిళ ఉమాబాలకు అనూహ్యంగా నరసాపురం పార్లమెంటు సీటు దక్కింది. అయితే ఆమె ఎంపిక పట్ల వైసీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె టీడీపీ + జనసేన కూటమి క్యాండిడేట్‌కు ఎంత వరకు పోటీ ఇస్తుందన్న సందేహాలు ఉన్నాయి.