పరుగుల సునామీ
టీం ఇండియా ఆటగాళ్లు కుమ్మేశారు. అవేం షాట్లు. సిక్సర్లు.. ఫోర్లు... పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు
టీం ఇండియా ఆటగాళ్లు కుమ్మేశారు. అవేం షాట్లు. సిక్సర్లు.. ఫోర్లు... పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. చాలా ఏళ్ల తర్వాత ఒక పసందైన మ్యాచ్ ను భారత్ క్రికెట్ అభిమానులు చూశారు. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేశారు. పాక్ కు ఇది భారీ లక్ష్యమే. ఓవర్ కు ఏడు పరుగులు చేయాల్సిన లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచారు. వర్షం అడ్డంకిగా మారినా అదిరిపోయే షాట్లతో టీం ఇండియా బ్యాటర్లు అలరించారు. స్టేడియం మొత్తం వారి ఆటకు ఫిదా అయింది.
భారీ స్కోరు....
ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగిన తొలి వన్డేకు వర్షం అడ్డంకి కావడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ మిగిలింది. రెండో సారి దాయాది దేశాలు తలపడుతుండటంతో మరోసారి వర్షం ఆటంకంగా మారుతుందని భావించారు. అయితే వరుణుడు శాంతించడంతో భారత్ బ్యాటర్లు యాభై ఓవర్లను ఆడేశారు. యాభై ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేశారు. ఇది ఆషామాషీ టార్గెట్ కాదు. పాకిస్థాన్ ఈ లక్ష్యాన్ని ఛేదించాలంటే తొలి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాల్సిందే.
ఇద్దరూ సెంచరీలు...
టీం ఇండియా బ్యాటర్లు చాలా రోజుల తర్వాత తమ సత్తా చాటారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అర్ధసెంచరీలు చేయగా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరి భాగస్వామ్యం రెండు వందలు దాటింది. వన్డేల్లో పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ 13,000 పరుగుల రికార్డును అధిగమించాడు. కేఎల్ రాహుల్ కూడా గాయం తర్వాత తిరిగి కోలుకుని జట్టులోకి చేరుకుని సెంచరీ చేయడం కూడా టీం ఇండియాకు కలసి వచ్చింది. విరాట్ కోహ్లి 122, కేఎల్ రాహుల్ 111 పరుగులు చేసి భారత్ కు పరుగుల వరదను సృష్టించారు.