Akash Deep : మరో డేంజరస్ బౌలర్... వచ్చేశాడు... వచ్చీ రావడంతోనే నిరూపించుకున్నాడు

తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఆకాశ్ దీప్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు

Update: 2024-02-23 13:08 GMT

టీం ఇండియాలో చోటు దక్కడమంటే మాటలు కాదు. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చతికలపడిన వాళ్లు అనేక మంది ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లోనూ, ఐపీఎల్ వంటి ఆటల్లో దుమ్ము రేపినా అంతర్జాతీయ మ్యాచ్‌లకు వచ్చేసరికి కొందరు తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టలేకపోతున్నారు. అలవాటయిన బంతే అయినప్పటికీ .. అదృష్టం కూడా అందరికీ కలసి రాదు. కొందరే లక్కును తమ వైపు లాక్కుంటారు. అలాంటి వారు ఇటీవల చాలా మంది కనిపిస్తున్నారు. యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా ఆకాశ్ దీప్. అవును.. తనకు అంది వచ్చిన అవకాశాన్ని ఈ కుర్రోడు చక్కగా వినియోగించుకున్నాడు.

ఎన్ని కష్టాలు...?
ఆకాశ్ దీప్‌ది సాధారణ మధ్య తరగతి కుటుంబం. పుట్టింది బీహార్ లో. కానీ క్రికెట్ కోసం బెంగాల్ కు వచ్చేశాడు. క్రికెట కోసమే రాలేదు. బంతిపై అపారమైన ప్రేమతో బెంగాల్‌లో కాలు పెట్టాడు. ఆకాశ్ దీప్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చిన్న తనంలోనే ఎదుర్కొన్నాడు. క్రికెట్ లో అడుగుపెట్టే క్రమంలోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత సోదరుడు కూడా దూరమయ్యాడు. కానీ ఆకాశ్ దీప్ కు క్రికెట్ పై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. కఠోర సాధన చేశాడు. బౌలింగ్ లో మెలుకువలను నేర్చుకున్నాడు. క్రికెటర్ కావాలంటే కేవలం ప్రతిభ ఉంటే చాలునని మరోసారి ఈ యువకెరటం నిరూపించాడు. అంతేకానీ ధనం, పైరవీలు వంటివి అవసరం లేదని చాటి చెప్పాడు.
సెలక్టర్ల దృష్టిలో పడి...
బెంగాల్ ఉంటూ బౌలింగ్ లో మెలుకువలను నేర్చుకున్నాడు. వేగం, వికెట్ల మీదకు బంతిని విసరడంలో రాటు దేలాడు. అక్కడ క్రికెట్ అకాడమీలో చేరి శిక్షణ పొందాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్ మ్యాచ్ లలో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. తర్వాత సౌరవ్ గంగూలీ ప్రవేశపెట్టిన విజన్ 2020 కి సెలక్ట్ అయ్యాడు. దీంతో అతడి దశ కొంత తిరిగింది. అనంతరం బెంగాల్ తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కాలు మోపాడు. ఆ తర్వాత టీ 20లలోనూ అడుగుపెట్టాడు. అతడు మొత్తం మీద 30 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్ లు ఆడి 104 వికెట్లు తీశాడు. బంతిని వికెట్లకు రెండు వైపులా స్వింగ్ చేయడం ఆకాశ్ దీప్ స్పెషాలిటీ. దీనిని కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా గుర్తించాడు.
తొలిరోజు మూడు వికెట్లు...
బంతిని 140 కిలోమీటర్ల వేగంతో వేయగల బౌలర్‌గా సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. చివరకు రాంచీ టెస్ట్ మ్యాచ్ కు ఎంపికయ్యాడు. టీం ఇండియా మేనేజ్‌మెంట్ ఆశలను ఆకాశ్ దీప్ వమ్ము చేయలేదు. తొలి మ్యాచ్‌లోనే తొలి రోజు మూడు కీలక వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను ఒకరకంగా ఆడుకోలేదు. బంతితో వణికించాడు. ఓపెనర్లు చాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీం ఇండియాకు మరో సత్తా ఉన్న బౌలర్ దొరికినట్లే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే మనకు మరో సత్తా ఉన్న బౌలర్ దొరికాడన్నది మాత్రం వాస్తవం.



Tags:    

Similar News