టాలెంట్ ఉందయ్యా... వెతకక్కర్లే...వారిని తీసుకోండి బ్రో
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి సారి అంతర్జాతీయ మ్యాచ్ లో అడుగు పెట్టి అదరగొట్టేశాడు సర్ఫరాజ్ ఖాన్
ఎందులోనైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. కానీ క్రికెట్ అలా కాదు. ఎవడు కొడితే వాడే మొనగాడు. ఆ మ్యాచ్ లో ఇరగదీసిన వాడే అసలైన ఆటగాడు. అందుకే టాలెంట్ ఉన్నోళ్లంతా వెనకబడి పోకుండా ప్రతి మ్యాచ్ లో జట్టులో మార్పులు చేస్తుంటే అసలు టాలెంట్ బయటకు వస్తుంది. పాత ఆటగాళ్లు పాతుకుపోయి ఉండటంతో కొత్తోళ్లకు అవకాశాలు దొరకడం లేదు. ఫామ్ లో లేకపోయినా కొందరి ఆటగాళ్లను బీసీసీఐ కొనసాగిస్తుండటం వల్లనే టీం ఇండియా ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్స్ వరకూ వచ్చి కప్పును చేజార్చుకుందన్న కామెంట్స్ అప్పట్లోనే వినిపించాయి.
దేశవాళీ క్రికెట్ లో...
దేశవాళీ క్రికెట్ లో ధనాధన్ మంటూ మోతెక్కించే బ్యాటర్లు అనేక మంది ఉన్నారు. వికెట్లను కుప్పకూల్చే సామర్ధ్యం ఉన్న బౌలర్లకు మనకు కొదవ లేదు. కానీ బీసీసీఐ ప్రయోగాలకు ఇష్టపడక పోవడం వల్లనే కొత్త వారికి అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆడే అవకాశం లభించడం లేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అంటున్నా వారి మొరను ఆలకించే వారు లేరు. పైరవీలున్న వారికే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలను కూడా బీసీసీఐ మూటగట్టుకుంది. అయితే సీనియర్ ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ లకు దూరమయినప్పుడు, వారు గాయాల పాలయినప్పుడు మాత్రమే కొత్త వారికి ఛాన్స్ దొరుకుతుండటం జరుగుతుంది.
సర్ఫరాజ్ ఖాన్‌ను చూసిన తర్వాతైనా...?
అయితే అటువంటివి చాలా అరుదుగా జరుగుతున్న విషయాలు. తాజాగా భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి సారి అంతర్జాతీయ మ్యాచ్ లో అడుగు పెట్టి అదరగొట్టేశాడు సర్ఫరాజ్ ఖాన్. కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు మనోడు. అసలు టెస్ట్ మ్యాచ్ అన్న విషయాన్ని మరచిపోయి బంతిని ఒక ఆటాడుకున్నాడు. క్రికెట్ చెడుగుడు ఆడుతూ కనిపించిన సర్ఫరాజ్ ఖాన్ చూసిన వారికి ఎవరికైనా టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఇంకా ఉన్నారని, వారిని తీసుకుంటే భారత్ జట్టుకు విజయంలో ఢోకా ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికైనా బీసీసీఐ కొన్ని మ్యాచ్ లలో ప్రయోగాలు చేసి టాలెంట్ ఉన్నోళ్లకు అవకాశాలు ఇవ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.