INDvsAUS: 2500 మంది సిబ్బందితో భారీగా బందోబస్తు

మైదానం చుట్టూ సోమవారం తెల్లవారు జాము వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. మైదానం, పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Update: 2022-09-25 10:19 GMT

నేడు ఉప్పల్ వేదికగా భారత జట్టు, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్ సమం అవ్వడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకమైంది. టిక్కెట్ల విక్రయాలపై జరిగిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగే కీలకమైన మ్యాచ్ కు దాదాపు 40,000 మంది ప్రేక్షకులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. 2500 మంది పోలీసులను కాపలాగా ఉంచారు. ఆటగాళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి, ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి, ప్రేక్షకులు సజావుగా స్టేడియం లోకి వచ్చి వెళ్ళడానికి వీలు కల్పించారు. డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ డిస్పోజల్, ఆక్టోపస్, ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్, స్పెషల్‌ బ్రాంచ్, ఐటీ సెల్, షీ టీమ్స్‌ అన్ని పోలీసు విభాగాలు విధుల్లో ఉన్నాయి.

మైదానం చుట్టూ సోమవారం తెల్లవారు జాము వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. మైదానం, పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్‌ లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు. ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్, ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలను కూడా ప్రవేశం లేదు. పార్కింగ్‌ ఏర్పాట్లపై ప్రత్యేక యాప్‌ ఉంటుంది. టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్‌ మెసేజ్‌ రూపంలో వస్తుంది. స్థానిక పోలీసులు నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు - పెంపుడు జంతువులు, తినుబండారాలు, సిగరెట్లు, వీడియో కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, బాణసంచా, సెల్ఫీ స్టిక్‌లు, పదునైన వస్తువులు, హెల్మెట్లు, బ్యాక్‌ప్యాక్‌లు, మద్యం, డ్రగ్స్ - స్టేడియంలోకి అనుమతించరు. స్టేడియంలోకి నిషేధిత మెటీరియల్‌ని ఎవరూ తీసుకెళ్లకుండా ఉండేలా స్టేడియంలో హై-ఇంటెన్సిటీ స్కానర్‌లను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్‌లను స్టేడియంలోకి అనుమతించినప్పటికీ, ప్రేక్షకులు పవర్ బ్యాంక్‌లు, ఛార్జర్‌లను స్టేడియంలోకి తీసుకెళ్లకూడదు. ప్రేక్షకులను పర్యవేక్షించడానికి స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించారు.
రెండు జట్లు నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. నాగ్ పూర్ లో 8 ఓవర్ల మ్యాచ్‌ మాత్రమే సాధ్యమవ్వగా.. భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంకొన్ని గంటల్లో హైదరాబాద్ వేదికగా సిరీస్ ఎవరిదో తేలిపోనుంది.


Tags:    

Similar News