India vs England Third Test : నేడు భారత్ - ఇంగ్లండ్ మూడో టెస్ట్.. ఎవరు గెలిస్తే వారిదే పైచేయి

నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది

Update: 2024-02-15 03:23 GMT

నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రెడు జట్లకు కీలకం. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి చెరొక పాయింట్ ను సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్, విశాఖలో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పుడు 1 - 1 తో సమానంగా ఉన్నాయి. అందుకే ఈరోజు నుంచి జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. రాజ్‌కోట్ పిచ్ పై పరుగులు అత్యధికంగా వచ్చే అవకాశముంది.

పై చేయి సాధించాలంటే...
ఇంగ్లండ్ పై సిరీస్ లో పైచేయి సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం భారత్ కు అవసరం. అయితే భారత్ ఆటగాళ్లలో ఎక్కువ మంది ఫామ్ లో లేకపోవడం, మరికొందరు జట్టుకు దూరం కావడం కూడా ఇబ్బందికరమైన పరిణామమే. సొంతగడ్డపై సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న కసితో భారత్ ఉన్నప్పటికీ ఇంగ్లండ్ జట్టును తీసిపారేయడానికి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ జట్టు పటిష్టంగా ఉండటంతో మ్యాచ్ గెలవడం అంత సులువు కాదన్నది క్రీడా విశ్లేషకుల అంచనా. ఇందుకోసం వ్యూహంతో పాటు ఆటతీరు కూడా ముఖ్యమని చెబుతున్నారు.
స్వల్ప మార్పులతో...
భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, రజిత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ లేదా భరత్ లో ఒకరు, అశ్విన్, కులదీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ లతో భారత్ పోరుకు సిద్ధమవుతుంది. సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ లో అడుగు పెట్టబోతుున్నారు. ఇంగ్లండ్ జట్టు కూడా కొద్ది మార్పులతో మైదానంలోకి అడుగుపెట్టనుంది. విరాట్ కొహ్లి ఈ మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండరని ఇప్పటికే ప్రకటించారు. దీంతో రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగనుంది. ఎవరిని గెలుపు వరిస్తే వారిదే సిరీస్ పై ఆధిపత్యం అవుతుంది.



Tags:    

Similar News