India vs Zimbabwe T20 : తొలి మ్యాచ్ లో తడబడ్డారు... రెండో మ్యాచ్ లోనైనా తేరుకుంటారా?

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓటమి పాలయింది

Update: 2024-07-07 03:02 GMT

భారత యువ ఆటగాళ్లు తొలి మ్యాచ్ లోనే ఇబ్బంది పడ్డారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓటమి పాలయింది. 13 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. వరల్డ్ కప్ సాధించి సగర్వంగా ఇటీవల ఇండియాకు చేరుకున్న జట్టును చూసి సంతోషిస్తున్న సమయంలో భవిష్యత్ ఆటగాళ్లు ఇలా డీలా పడిపోయి ఓటమి పాలుకావడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ లో ఒక ఊపు ఊపిన వారంతా బ్యాట్ ను పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇంత దారుణ ఓటమిని ఎవరూ ఊహించలేదు. గెలవాల్సిన మ్యాచ్ ను టీం ఇండియా చేజాతులో చేజార్చుకుంది. అంచనాలు అధికంగా పెట్టుకున్న ఆటగాళ్లు అందరూ వరసగా పెవిలియన్ బాట పట్టారు.

తక్కువ పరుగులకే...
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు తక్కువ పరుగులకే అవుట్ అయింది. 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీసి జింబాబ్వే జట్టును తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగారు. జింబాబ్వే జట్టులో మడాండే 29 అత్యధిక పరుగులు చేయగలిగాడు. 115పరుగులు అంటే ఇండియాకు పెద్ద కష్టం కాదు. ఈ మ్యాచ్ ను సులువుగా గెలుస్తామని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఐపీఎల్ లో సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిన ఆటగాళ్లు ఉండటంతో ఇక విజయం గ్యారంటీ అనుకున్న టీం ఇండియాకు జింబాబ్వే బౌలర్లు షాక్ ఇచ్చారు.
వరసబెట్టి...
అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ ఏడు పరుగులు చేసి వెనుదిరిగాడు. రియాన్ పరాగ్ రెండు పరుగులకే అవుట్ అయి నిరాశ పర్చాడు. రింకూ సింగ్ కూడా జీరోతో వెనుదిరిగాడు. కెప్టెన్ శుభమన్ గిల్ ఒక్కడే అత్యధికంగా 31 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు. మిగిలన వాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. భారత్ 19.5 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేడు రెండో టీ20 మ్యాచ్ హరారేలోనే జరగనుంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి కొంత పట్టు సాధించలేకపోతే మాత్రం సిరీస్ ను చేజార్చుకున్నట్లే. యువ క్రికెటర్లపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం వమ్ముకానుంది. చూడాలి మరి ఈరోజు మనోళ్లు ఏలా ఆడతారో.


Tags:    

Similar News