చివరి టీ20లోనూ మనదే విజయం.. రాణించిన సూర్యకుమార్, అయ్యర్
యువ క్రికెటర్ సూర్యకుమార్ 65 పరుగులతో అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. సూర్యకుమార్ కు తోడు వెంకటేష్ అయ్యర్ ..
టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్ లు ఆడేందుకు భారత్ కు వచ్చిన వెస్టిండీస్ జట్టు.. ఘోర పరాజయంతో స్వదేశానికి బయల్దేరుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. వరుసగా మూడు మ్యాచ్ లలోను టీమిండియానే గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత రాత్రి జరిగిన చివరి టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.
యువ క్రికెటర్ సూర్యకుమార్ 65 పరుగులతో అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. సూర్యకుమార్ కు తోడు వెంకటేష్ అయ్యర్ మెరుపులతో భారత జట్టు తొలుత 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి.. విండీస్ కు భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు సాధించగా, సూర్యకుమార్ 31 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి టీ20ల్లో తన నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (7) తీవ్రంగా నిరాశ పరిచారు.
బరిలోకి దిగిన విండీస్ క్రికెటర్లు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం పాలైంది. పూరన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 61 పరుగులు చేయగా, రొమారియో 21 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. రోవ్‌మన్ పావెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. మిగతా విండీస్ క్రికెటర్లలో ఎవరూ 10 పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ చేరుకున్నారు. టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా.. దీపక్, అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీశారు. బ్యాటింగ్ లో చెలరేగిన సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.