ఇదెక్కడి షాక్.. ఉప్పల్ కు నో ఎంట్రీ అట

ఇక ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నమెంట్ ను ఆడడానికి పాకిస్తాన్ జట్టు భారత్‌కు రానుంది.

Update: 2023-09-20 09:06 GMT

భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. అయితే భారత్ ఆడే మ్యాచుల్లో ఒక్కటి కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. ఇక ఉప్పల్‌ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌ జరగనుండగా.. ఆ మ్యాచ్ ను అయినా వీక్షిద్దామని అభిమానులు ఆశిస్తూ ఉండగా.. ఆ మ్యాచ్ ను వీక్షించడానికి ప్రేక్షకులను అనుమతించడం లేదని తెలిపారు. ఈ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగనుంది. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ -ఉన్ -నబీ పండగ ఉండటంతో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ నగర పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పష్టం చేశారు. బీసీసీఐ సూచన మేరకు హెచ్‌సీఏ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. ఇక అక్టోబర్ 3న ఆస్ట్రేలియా–పాక్‌ వార్మప్‌తో పాటు మూడు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.

ఇక ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నమెంట్ ను ఆడడానికి పాకిస్తాన్ జట్టు భారత్‌కు రానుంది. ఈ నెల 25వ తేదీన భారత్‌కు రానుంది పాకిస్థాన్. తొలుత దుబాయ్‌కు వెళ్తుంది. అక్కడ రెండు రోజుల విశ్రాంతి అనంతరం భారత్‌కు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు రానుంది. అక్టోబర్ 6వ పాకిస్తాన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అక్టోబర్ 14వ తేదీన భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌ ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది.


Tags:    

Similar News