IPL 2025 : రాయల్స్ ను సులువుగా ఓడించిన ఛాలెంజర్స్
జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఏపక్షంగా విజయం సాధించింది;

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సొంత గడ్డ మీద కన్నా ఇతర పిచ్ లపైనే ఎక్కువ విజయాలు సాధించింది. ఈ సీజన్ లో తన సొంత మైదానమైన బెంగళూరులో రెండు జట్లపైన ఓటమి పాలయిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇతర వేదిక పై విజయాలను సాధిస్తూ ముందుకు వెళుతుంది. సొంత మైదానండబెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు అచ్చి రాలేదని అనిపిస్తుంది. నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఏపక్షంగా విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికి నాలుగు పరాజయాలు చవి చూసి ఇబ్బందులు పడుతుండగా, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
రాయల్స్ తడబడి...
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పెద్ద స్కోరు ఏమీ సాధించలేకపోయింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేయగలిగారు. ఓపెనర్లుగా దిగిన యశస్వి జైశ్వాల్ 75 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ పదిహేను పరుగులకే అవుటయ్యాడు. రియాన్ పరాగ్ 30 పరుగులు చేసిన తర్వాత అవుటయి వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ 35 పరుగులు చేశాడు. ఇక ఎవరూ అంతకు మించి పరుగుుల చేయలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ మొత్తం 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో హేజల్ వుడ్, కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.
తక్కువ స్కోరు అవ్వడంతో...
తక్కువ స్కోరు కావడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నింపాదిగా ఆడటం ప్రారంభించలేదు. ఓపెనర్లుగా దిగిన సాల్ట్, విరాట్ కోహ్లి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. ఎంతగా అంటే సాల్ట్ ఒక్కడే 65 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని మోత మోగించాడు. కోహ్లి కూడా తక్కువ తినలేదు. నింపాదిగా ఆడుతూ నాటౌట్ గా నిలిచి 62 పరుగులు సాధించాడు. వడిక్కల్ నాటౌట్ గా నిలిచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు విజయాన్ని సాధించి పెట్టాడు. కేవలం 17.3 ఓవర్లలోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఒక వికెట్ కోల్పోయి 175 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కుమార్ కార్తికేయ ఒక్కరే ఒక్క వికెట్ తీయగలిగాడు. మొత్తం మీద బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలుపుతో ప్లే ఆఫ్ ఛాన్సెస్ ను మెరుగుపర్చుకున్నట్లయింది.