IPL 2025 : ఓటమి ఎవరిదో చివరి వరకూ తేలదా?
ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడుతుంది. ఢిల్లీ కాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ టీం తలపడనుంది;

ఐపీఎల్ నేడు కూడా రెండు మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. ఆదివారం కావడంతో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటి వరకూ కొంత ఇబ్బంది పడిన జట్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. విజయాల బాటపడుతున్నాయి. అదే సమయంలో వరస విజయాలతో వస్తున్న జట్లకు కొంత బ్రేక్ పడుతుంది. ఈ సందర్భంగా ఇక జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని జట్లు కూడా ఛాంపియన్స్ అవ్వాలని భావస్తుండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది.
పోటాపోటీగా...
ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడుతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ జైపూర్ లో జరగనుంది. ఇక రెండో మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ఢిల్లీ కాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ టీం తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి రెండు మ్యాచ్ లో ఓడింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఐదు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి మూడింటిలో ఓటమి పాలయింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. ఇక ఢిల్లీ కాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలించింది. ఇప్పటి వరకూ ఓటమి అనేది లేకుండా ఆ జట్టు పయనిస్తుంది. నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలోనూ ఢిల్లీ కాపిటల్స్ గెలవగా, ముంబయి ఇండియన్స్ మాత్రం ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. మరి ఈరోజు ముంబయి ఇండియన్స్ ఢిల్లీ కాపిటల్స్ ను నిలువరిస్తుందా? లేదా? అన్నది చూడాలి.