'తుమ్మల' దారెటు.. ఆ సమావేశం వెనుక ఆంతర్యమేంటి?

BRS leader Thummala Nageswara Rao discussing with his followers about changing party

Update: 2023-08-31 04:31 GMT

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసింది. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్‌ దక్కని అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా పార్టీ మారే పనిలో ఉన్నారు. వారందరిని బీఆర్‌ఎస్‌ అధిష్టానం బుజ్జగింపులు చేసినా.. ఫలితం ఉండే అవకాశం కనిపించడం లేదు. వారు పార్టీ మారుతారా..? లేక సొంతగూటిలోనే కొనసాగుతారా..? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే చాలా మంది టికెట్‌ రాని ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారనున్నారా..? ఆయన అనుచరుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తుమ్మల మరో పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తుమ్మల వర్గీయులు, అనుచరుల మాటలు వింటే ఆయన పార్టీ మారుతున్నారనే వినిపిస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గండుగులపల్లిలోని నివాసంలో తుమ్మల నాగేశ్వరరావును పలువురు నాయకులు కలిశారు. ఈ భేటీలో పాలేరు నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పార్టీ మారాలని, తామంతా అండగా ఉంటామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండాలన నేతలు తుమ్మలను కోరినట్లు తెలుస్తోంది. చివరకు మళ్లీ ప్రయత్నించాలని.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారైనా పోటీ చేయాలంటూ సూచించారట. ఆయన అనుచరులతో తుమ్మల సమావేశం కావడం వెనుక ఆంతర్యమేమిటని చర్చ కొనసాగుతోంది.

తాజాగా కేసీఆర్‌ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేదు. అయితే 2018లో కాంగ్రెస్ లో గెలుపొంది.. బీఆర్ఎస్ లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఏ పార్టీ నుంచి అన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే సొంత పార్టీ నుంచి టికెట్‌ దక్కకపోయినా పోటీ చేస్తానని చెప్పడం వెనుక పార్టీ మారుతారన్న విషయం స్పష్టమవుతోంది. అయితే పార్టీ మార్పుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక అసంతృప్తితో ఉన్న బీఆర్‌ఎస్ నేతలను అంటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ గాలం వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై త్వరలో క్లారిటీ ఇస్తానని తుమ్మల చెప్పినట్లు సమాచారం. మరి నిజంగాన తుమ్మల పార్టీ మారుతారా..? లేక బీఆర్‌ఎస్‌ పార్టీ బుజ్జగింపులతో సొంత పార్టీలోనే ఉంటారా..? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News