చాలా రోజుల తర్వాత... ఒకే వేదికపై
చాలా రోజుల తర్వాత గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు.
చాలా రోజుల తర్వాత గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం సందర్బంగా గవర్నర్, ముఖ్యమంత్రి కలుసుకున్నారు. మాటలు లేకున్నా ఒకే వేదికపై కన్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది అక్టోబరు 11వ తేదీన రాజ్ భవన్ కు వచ్చారు. అనంతరం గవర్నర్ తో తలెత్తిన విభేదాల కారణంగా ఆయన రాజ్ భవన్ రావడం మానేశారు.
అప్పటి నుంచే...
ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ కు పంపింది. అయితే గవర్నర్ ఆ ఫైలును తొక్కిపెట్టారు. తన పరిశీలనలో ఉందని ఆమె చెబుతూ వచ్చారు. అప్పటి నుంచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి రాజ్‌భవన్ లోకి కేసీఆర్ అడుగుపెట్టలేదు. బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే కొనసాగించారు. గవర్నర్ కూడా పలుమార్లు బహిరంగంగా ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇద్దరూ చాలా రోజుల తర్వాత ఒకే వేదిక పై కన్పించారు.