R. Krishnaiah : ఆర్. కృష్ణయ్య రూటు ఎటు? నాలుగేళ్ల పదవిని ఎందుకు కాలదన్నుకున్నారుగా

రాజ్యసభ సభ్యత్వానికి బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు.

Update: 2024-09-29 12:08 GMT

రాజ్యసభ సభ్యత్వానికి బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. అయితే ఆయన తన రాజీనామాకు గల కారణాలు చెబుతూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నిజానికి బీసీల మీద ప్రేమ ఉంటే రాజ్యసభలో వారి సమస్యలను ప్రస్తావించడానికి ఎంపీ పదవి ఒక వరం కాదా? రోడ్డు మీద ఆందోళనల కంటే చట్ట సభల్లో బీసీ తరుపున వాయిస్ వినిపించడం మంచిదా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా తాను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని చెబుతున్న ఆర్.కృష్ణయ్య పదవికి రాజీనామా చేయకుండా, పార్టీకి రాజీనామా చేసి ఉంటే బీసీలు కూడా నమ్మి ఉండేవారంటున్నారు. నాలుగేళ్ల పదవీ కాలాన్ని, అందులోనూ పెద్దల సభలో తొలి సారి అవకాశాన్ని కాలదన్నుకోవడానికి బలమైన కారణం ఉండి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పదవి అడ్డమా?
నిజానికి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయదలచుకుంటే రాజ్యసభ పదవి అడ్డమొస్తుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తన లక్ష్యమని చెబుతున్న ఆర్.కృష్ణయ్య రాజ్యసభ పదవి వల్లనే తాను ఉద్యమాన్ని బలోపేతం చేయలేకపోతున్నానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగా రాజీనామా చేయదలచుకుంటే, తనకు పదవి ఇచ్చిన జగన్ కు సమాచారం ఇచ్చి ఉండేవారని, అదే సమయంలో బీసీ ముఖ్య నేతలతో సమావేశమై తన రాజీనామా విషయమై చర్చించి ఉండేవారని, కానీ ఏకపక్షంగా ఆయన రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నది కొందరి ప్రయోజనాల కోసమేనన్నది స్పష్టంగా అర్థమవుతుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ ఆర్. కృష్ణయ్య బీసీల ప్రయోజనం కోసమే ఎదిగిన నేత. బీసీల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. అలాగే ఆయన ఎదిగారు. బీసీ లీడర్ గా జాతీయ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది కూడా బీసీ సంఘమే. అందులో ఎవరూ కాదనడానికి లేదు.
ఏపీ బీసీ సంఘాల నేతలు...
ఏపీలోని బీసీ సంఘాల నేతలు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్.కృష్ణయ్య ఎవరి మాటలకు తలొగ్గి రాజీనామా చేశారో అందరికీ తెలుసునని, రాజీనామా వల్ల నష్టపోయేదెవరు? లబ్ది పొందేదెవరో కూడా తెలుసునని బీసీ నేతలే అంటున్నారు. జగన్ తనను రాజకీయంగా వాడుకోవాలని చూసినందునే తాను రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆర్.కృష్ణయ్య మరి ఆ పార్టీకి రాజీనామా చేసి ఉంటే సరిపోయేది కదా? అన్న ప్రశ్నలు బీసీ నేతలే వేస్తున్నారు. మరో నాలుగేళ్లు పదవి ఉన్నా రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేయడంలో రహస్యం ఏమిటో? అంటూ నెట్టింట పోస్టులు కనపడుతున్నాయి. కానీ ఆర్.కృష్ణయ్య మాత్రం తాను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే పదవికి రాజీనామా చేశానని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఆర్.కృష్ణయ్య రాజీనామా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
అన్ని పార్టీలూ మారి...
ఆర్ కృష్ణయ్య బీసీ సంఘ నేతగా ఉన్నప్పటికీ అనేక రాజకీయ పార్టీలను ఆయన మారారు. 2014లో టీడీపీ తరుపున ఎల్.బి. నగర్ శాసనసభ నుంచి పోటీ చేసి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్. కృష్ణయ్యను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. తర్వాత గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వైసీపీ అధినేత జగన్ పిలిచి మరీ రాజ్యసభకు పంపితే ఇలా రాజీనామా చేసి పారేశారు. ఉద్యమానికి పదవి అడ్డువస్తుందని భావిస్తే.. 2022లోనే జగన్ ప్రతిపాదించినా సున్నితంగా ఆ పదవిని తిరస్కరించాల్సింది కదా? అని వైసీపీ బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News