అపురూప ఆలయాలకు ఆదరణ కరువు, భీమారం శిధిల శివాలయాన్ని కాపాడుకోవాలి!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో, కేతపల్లి మండలం, భీమారంలో కాకతీయ కాలపు శిధిల శివాలయాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.

Update: 2024-06-21 08:40 GMT

సూర్యాపేట, జూన్, 21: సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో, కేతపల్లి మండలం, భీమారంలో కాకతీయ కాలపు శిధిల శివాలయాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆమనగల్లు కు చెందిన దాస్యం వెంకట సురేందర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శుక్రవారం నాడు భీమారంలోని శివాలయాలను పరిశీలించారు. గ్రామ శివారులో గల రైస్ మిల్ దగ్గర పొలాల్లో ప్రవేశ మండపం, మహామండపం, గర్భాలయాలతో ఉన్న శివాలయం గోడల బయటి వరసరాళ్లు, మహా మండపం కప్పురాళ్లు కూలిపోయాయని, గర్భాలయంలోని శివలింగం, నంది శిథిలమైనాయని, ఆలయం చుట్టూ, పైన ముళ్లపొదలు పెరిగి చారిత్రక కట్టడం ఉనికికే ప్రమాదం వాటిలిందన్నారు.




అనంతరం భీమారం గ్రామ వెలుపల మూసి నదికి దగ్గర్లో గల గర్భాలయం, అర్దమండపం, మహా మండపం గల మరో శివాలయం పూర్తిగా శిథిలమైందని, ఆలయం లోపల నంది, శివలింగం చుట్టూ కాకతీయుల కాలపు భిన్నమైన భైరవ, నంది, గణేశా శిల్పాలు ఉన్నాయని, ఆలయ మండపం లోను, చుట్టూరా ముళ్లపొదులు పెరిగాయని శివనాగిరెడ్డి చెప్పారు. 800 ఏళ్ల నాటి అపురూప ఆలయాలను, అద్భుత శిల్పాలను అలన పాలనా లేక నిరాదరణకు గురికావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చరిత్ర, సాంస్కృతికి అద్దంపడుతున్న ఈ వారసత్వ కట్టడాలను, శిల్పాలను పరిరక్షించి రాబోయే తరాలకు అందించాలని శివనాగిరెడ్డి భీమారం గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. రెండు ఆలయాలు చుట్టూ పెరిగిన ముళ్లపదలను తొలగించి, పడిపోయిన రాళ్ళను యధా స్థానంలో పునర్నిర్మిస్తే ఆలయాలు అలనాటి వైభవాన్ని సంతరించుకుంటాయని ఆయన ఆశాభావంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, ఈమని రాజ్యలక్ష్మి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.








 



Tags:    

Similar News