KCR : రేవంత్ రెడ్డీ.. ఛేజ్ చేస్తాం.. వేటాడతాం.. కుక్కల్ని.. నక్కల్ని లాక్కోవడం కాదు
తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు
తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కుక్కల్ని, నక్కల్ని లాక్కుని చంకలు గుద్దుకుంటున్నారన్నారు. ఒకరిద్దరూ చిల్లరగాళ్లు పోతే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీప్ పాలిటిక్స్ తప్ప మరేదీ తెలియదని అన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. తాము అధికారంలో ఉండగా ఒక్క ఎకరా ఎండిపోకుండా కాపాడుకున్నామన్నారు. మొన్నటి వరకూ కాలిపోని మోటార్లు ఇప్పుడు ఎందుకు కాలిపోతున్నాయని ప్రశ్నించారు. రైతుల పక్షాన మాట్లాడే వాళ్లు లేరనుకుంటున్నారా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ అన్నారు.
పంట ఎండిపోతున్నా....
లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఛేజ్ చేస్తానని, పరిగెత్తిస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. ప్రాజెక్టులు కొట్టుకుపోయాయంటూ డ్రామాలాడుతున్నారని, కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లు అధికారంలో ఉండగా అభివృద్ధి పై దృష్టిపెట్టాము తప్పించి కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. రాత్రింబవళ్లూ కష్టపడి కరెంటు తెచ్చామని, నీళ్లు తెచ్చామని అన్నారు. రెండు లక్షల రుణ మాఫీ ఏమయిందని కేసీఆర్ ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాలన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు.
ఏప్రిల్ లో నిరసనలు....
రేవంత్ రెడ్డి.. గీవంత్ రెడ్డి జాన్తానై... నాలుగునెలలు ఆగామని, ఇక ఊరుకోబోమని అన్నారు. వేటాడతామని ఆయన అన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసేంత వరకూ వదలి పెట్టబోమని అన్నారు. ఎనిమిదేళ్లు వచ్చిన కరెంట్ ఒక్కసారి ఎందుకు మాయమయిందన్నారు. మేడిగడ్డ పేరుతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏప్రిల్ 6న ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని దీక్షలు చేస్తామని తెలిపారు. రైతులను తాను ఒకటే కోరుతున్నానని ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ పక్షాన తాము ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన పనిలేదని, తాము ఈ ప్రభుత్వాన్ని వదిలపెట్టే ప్రశ్నేలేదని, వాళ్లని నిద్రపోనివ్వమని ఆయన తెలిపారు.