వారి పదవులు ఊడటం ఖాయం.. ఉప ఎన్నికలు పక్కా: కేటీఆర్
తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ తో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై
పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుల పదవులు ఊడటం ఖాయమని, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవన్నారు. వారిపై వేటు పడక తప్పదని, త్వరలోనే ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని హరీశ్ రావు జోస్యం చెప్పారు. "ఎమ్మెల్యేల అనర్హత ఫిటీషన్‌ల పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం. తెలంగాణ హైకోర్డు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ గెలుపు తథ్యం. హైకోర్టు తీర్పు కు అనుగుణంగా రాష్ట్ర శాసనసభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం." అంటూ ట్వీట్ చేశారు హరీశ్ రావు.
తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ తో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను తెలంగాణ హై కోర్టు ప్రశ్నించింది. ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు, వాదనలు ఎప్పుడు వింటారనే విషయాలను తమకు తెలియజేయాలని కోర్టు తెలిపింది. ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.