రేవంత్ పై హైకమాండ్ కు నమ్మకం లేకనే..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు

Update: 2024-02-09 12:20 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలసినప్పుడు తిరిగి వారి చేత ప్రెస్‌మీట్ పెట్టించడమంటే ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నాయకత్వానికి నమ్మకం లేదని అన్నారని, అయితే రేవంత్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా నమ్మకం లేదన్నారు. ప్రధాని మోదీని కలవడానికి ముఖ్యమంత్రి వెళ్లినప్పుడు ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను పంపించారంటూ ఎద్దేవా చేశారు.

జీతాలు అందరికీ...
ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ అధికారులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పడం సత్యదూరమని హరీశ్‌రావు అన్నారు. చాలా మందికి ఈరోజు కూడా జీతాలు రాలేదన్న హరీశ్ రావు జనవరి నెలలో ఆసరా పింఛన్లను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలను తక్కువ చేసిచూపించడానికి రేవంత్ చేసిన ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డికి తెలియదన్న హరీశ్ ఆయన ఏనాడైనా ఉద్యమానికి మద్దతిచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ సాగర్ డ్యాంపై ఏపీ పోలీసులు కాపలా ఉన్నారని, వారిని ఎందుకు పంపించడం లేదని ఆయన ప్రశ్నించారు.


Tags:    

Similar News