Kalvakuntla Kavitha : కవితకు మధ్యంతర బెయిల్ నేడు మంజూరవుతుందా? లేదా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది

Update: 2024-04-01 02:35 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. నేడు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుండటంతో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఆమె తన కుమారులకు పరీక్షలున్నాయని కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ వేశారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఏప్రిల్ 16వ తేదీ వరకూ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటీషన్ లో కోరారు.

ఈడీ అభ్యంతరాలు...
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపే అవకాశాలున్నాయి. కేసు ప్రస్తుతం కీలక దశలో ఉన్నందున సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశముందని వాదించనుంది. ఆమె బెయిల్ పై బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేస్తే విచారణపై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఈడీ తరుపున న్యాయవాదులు వాదించనున్నారు. దీంతో ఈ కేసులో కవితకు బెయిల్ వస్తుందా? లేక న్యాయమూర్తి తిరస్కరిస్తారా? అన్నది తేలనుంది.
15న అరెస్ట్ చేసి....
కల్వకుంట్ల కవితను గత నెల 15వ తేదీన హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజు ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. తొలుత ఆమెను విచారణ నిమిత్తం పది రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కస్టడీ గడువు ముగియకముందే కవిత సుప్రీంకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించినా ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. ఆమె మధ్యంతర బెయిల్ పై నేడు తీర్పు ఎలా వస్తుందోనని ఇటు కవిత అభిమానులు, బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు కవిత ఇది రాజకీయ కక్ష సాధింపుచర్యలతో కూడిన అరెస్ట్ అని చెప్పిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News