Revanth Reddy : తెలంగాణలో వారందరికీ అదనపు ఇళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుల వివరాల సేకరణ జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,మెదక్ జిల్లాల్లో వివరాలను సేకరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుడిలేని ఊరు ఉండవచ్చేమో కాని, ఇందిరమ్మ కాలనీలేని గ్రామం రాష్ట్రంలో లేదన్నారు. భూమి మీద పేదలకు హక్కు కలిగించింది ఇందిరమ్మఅని ఆయన అన్నారు. గిరిజనులకు ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా వారికి ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆదివాసీలకు ప్రత్యేకంగా...
ఆదివాసీలకు ప్రత్యేకంగా ఇళ్ల కోటాను విడుదల చేస్తామన్నారు. నియోజకవర్గంలో 3,500 ఇళ్ల కేటాయింపుతో సంబంధం లేకుండా ఆదివాసీలు, గిరిజనులకు ప్రత్యేకంగా ఇళ్లను అదనంగా మంజూరు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మట్టిమనుషులు ఆదివాసీలేనని అన్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది మొత్తం నాలుగున్నర లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పదేళ్లలో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పగలరా? అంటూ బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లలో నిబంధనలను సవరించి నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.