ఆ సమస్య సీజేఐ వల్లే పరిష్కారమయింది : సీఎం కేసీఆర్
కేంద్రం వల్ల పరిష్కారం కాని ఆ సమస్య జస్టిస్ రమణ సీజేఐ అయ్యాక పరిష్కారమయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.;
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. హైకోర్టు విభజన అయ్యాక బెంచీలు, జడ్జిల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖలు రాశానని.. కేంద్రం వల్ల పరిష్కారం కాని ఆ సమస్య జస్టిస్ రమణ సీజేఐ అయ్యాక పరిష్కారమయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన న్యాయాధికారుల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ పై ఆయనకున్న అమితమైన ప్రేమతో ప్రధాని, కేంద్రంతో మాట్లాడి హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారని చెప్పారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ ఉండటం గర్వకారణమని కొనియాడారు. జడ్జిల సంఖ్య పెరగడంతో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా, సివిల్ కోర్టుల్లో పనిభారం ఎక్కువగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే 42 మంది జడ్జిల హోదాకు తగ్గట్లుగా 30 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామని, దానికి శంకుస్థాపన సీజేఐతోనే చేయిస్తామని కేసీఆర్ తెలిపారు.