మాట ఇచ్చాం.. ఎన్ని కష్టాలొచ్చినా పూర్తి చేయాల్సిందే

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Update: 2023-08-02 13:42 GMT

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం నుండి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభించాలన్నారు. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైందని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే రుణమాఫీ ఆలస్యమైందని తెలిపారు. ఎఫ్ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందని.. రైతులకు మరో రూ.19వేల కోట్ల రుణాలను అందించాల్సి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీని మళ్లీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 3 నుండి రైతు రుణమాఫీని ప్రారంభించి, సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ఇవే చివరి సమావేశాలు కావడంతో.. రుణమాఫీ మీద విమర్శలు రాకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రుణమాఫీ అంశం ఎత్తకూడదని.. కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు, తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో రుణమాఫీ కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సిఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా.. సెప్టెంబర్ రెండో వారం వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు.


Tags:    

Similar News