లష్కర్ బోనాల్లో సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి ఉదయాన్నే తొలిబోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ సతీసమేతంగా.. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ ఏడాదంతా రాష్ట్రం పాడి, పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బంగారం బోనం సమర్పించారు.