Babu Mohan:ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్.. భారతీయ జనతా పార్టీకి ఇటీవలే రాజీనామా

Update: 2024-03-04 10:53 GMT

బీజేపీ తరఫున ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్.. భారతీయ జనతా పార్టీకి ఇటీవలే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. బీజేపీపై ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించిన బాబు మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు వరంగల్ స్థానం నుంచి బాబు మోహన్ బరిలో దిగనున్నారు. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తానని, ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బాబు మోహన్ భావిస్తున్నా ఇతర పార్టీలలో అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆయన ఎవరూ ఊహించని విధంగా ప్రజా శాంతి పార్టీలో చేరారు.

తెలుగుదేశం పార్టీలో మొదట బాబు మోహన్ ఉన్నారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. ప్రజాశాంతి పార్టీలో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుందో కాలమే సమాధానం చెబుతుంది.


Tags:    

Similar News