Telangana : తెలంగాణ నిరుద్యోగులకు ఈ నెలలో పండగే.. ఎన్ని ఉద్యోగాలో?
తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పనుంది.;

తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నిన్న ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో విడుదల కావడంతో ఇక ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వరస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు అవకాశాలు మెండుగా కలగనున్నాయి. ఇన్నాళ్లూ ఎస్సీ రిజర్వేషన్ కోసం నియామక ప్రక్రియను నిలుపుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఎస్సీ రిజర్వేషన్ జీవో విడుదల చేయడంతో ఇక నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకుని వాటిని భర్తీ చేసేందుకు రెడీ అవుతుంది.
జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్...
దీంతో పాటు గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను కూడా రీషెడ్యూల్ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు ఇరవైకి పైగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. గత ఏడాది నుంచి నిలిచిపోయిన నియామకాల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి పెద్దయెత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
రెండు కీలక నోటిఫికేషన్లు...
అనేక శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. వీటి సమాచారాన్ని పంపాలని ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు సమాచారాన్ని కోరుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో త్వరలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశముందన్న విషయం స్పష్టమయింది. ఈ నెలాఖరులోగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇందులో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో దాదాపు పథ్నాలుగు వేల పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సో.. తెలంగాణ నిరుద్యోగులకు ఇంతకంటే మంచివార్త ఏముంటుంది?