Telangana : విజయశాంతికి అదే రాజకీయంగా నష్టం తెచ్చిపెడుతుందా?

కాంగ్రెస్ నేత విజయశాంతికి ఏ పదవి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆమె రాజకీయాల్లో అనుసరించిన వైఖరే అందుకు కారణం

Update: 2024-12-29 12:24 GMT

రాజకీయాల్లో రాణించలేని నేతలకు మనకు కొదవలేదు. అయితే అలా వచ్చి ఇలా రాజకీయాల నుంచి "తెర"మరుగైన వారు అనేక మంది ఉన్నారు. వారిలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరు. సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయ రంగంలో మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. కేవలం ఒకే ఒక్కసారి ఆమె పార్లమెంటు సభ్యురాలిగా గెలిచారు. ఆమె యాటిట్యూడ్ కూడా ఇందుకు కారణమని అనుకోవాలి. విజయశాంతిని ఏ పార్టీ ఓన్ చేసుకోకపోవడానికి కారణం కూడా అదేనంటారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఆమె కనిపించడం, తర్వాత ఇంటికే పరిమితమవ్వడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి వస్తుందని భావించినా విజయశాంతి గురించి పట్టించుకునే వారే పార్టీలో లేరన్నది వాస్తవం.



పార్టీలన్నీ మారుతూ...

విజయశాంతి దాదాపు అన్ని పార్టీలూ మారారు. తొలుత బీజేపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టారు. తల్లి తెలంగాణ పార్టీ పేరుతో ఆయన జనంలోకి వెళ్లారు. కానీ జనం ఆదరించలేదు. అయితే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. కేసీఆర్ ఆమెను ఆదరించి దగ్గరకు తీశారు. మెదక్ ఎంపీని చేశారు. అయితే కేసీఆర్ తో సఖ్యతగా ఉండలేకపోయారు. అదే అక్కడే ఉండి ఉంటే పదేళ్ల పాటు ఏదో ఒక పదవి విజయశాంతిని వరించేది. కానీ తన యాటిట్యూడ్ మూలంగానే ఆమె పార్టీని వదిలి బయటకు వచ్చేశారు.
నిలకడలేమితో...
తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా నిలకడగా ఉండలేదు. కనీసం గాంధీభవన్ కు రావడానికి కూడా విజయశాంతికి మనసొప్పలేదు. అయినా 2018 ఎన్నికల్లో విజయశాంతికి ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించారు. కానీ తర్వాత మళ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ మారారు. తిరిగి బీజేపీ చెంతకు చేరారు. కొన్నాళ్లు బీజేపీలో కొనసాగిన విజయశాంతి తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వకూడదంటూ ఆమె బాగానే తిరిగారు. అయితే మొత్తం మీద 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తనకు ఏదో ఒక అవకాశం వస్తుందని భావించినా ఇంత వరకూ ఆమెను పట్టించుకునే వారు లేరు.
చాలా మంది వెయిటింగ్ లో...
అసలు పార్టీలో విజయశాంతి ఉన్నారా? లేదా? అన్న విషయంలో నేతలకే సందేహంగా ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నేనున్నానంటూ ఆమెచెబుతున్నా మెదక్ జిల్లా నేతలు కూడా విజయశాంతిని పట్టించుకోవడం లేదు. రాహుల్ గాంధీ వచ్చినా ఆమె కలవడానికి ఇష్టపడరు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు.కానీ పదవి కావాలంటారు. అందుకు ఎవరు మాత్రం అంగీకరిస్తారు? విజయశాంతికి రానున్న కాలంలో ఏ పదవి వచ్చే అవకాశం లేదు. అధికారంలోకి తాను ఉన్న పార్టీ వచ్చినా, ఆమెకు రాజకీయంగా ఉపయోగం లేదు. నేతలు కూడా ఆమెవల్ల ఉపయోగమేంటన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. కాంగ్రెస్ లో ఇప్పటికే హేమాహేమీలు పదవుల కోసం వెయిటింగ్ లో ఉన్నారు. విజయశాంతికి మాత్రం ఎలాంటి పదవి దక్కే అవకాశం లేదన్నది మాత్రం తెలంగాణ రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది.





Tags:    

Similar News