Eggs Attack: కోడిగుడ్లతో దాడి.. అసలు ఆ యాత్రలో ఏమి జరుగుతోంది?

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది

Update: 2024-02-28 09:26 GMT

Eggs Attack:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. వంగరలో దివంగత పీవీ నరసింహారావు ఇంటిని సందర్శించిన అనంతరం ఆయన ముల్కనూరు బయలుదేరారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా ఉండిపోయారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేస్తే మీరు చూడటం తప్ప ఏమీ చేయడం లేదు.. పోలీసులు నాకు అవసరం లేదు, మీరు వెళ్లిపోండని బండి సంజయ్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు:
బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వీడియోను విడుదల చేశారు. ఈరోజు నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా నియోజకవర్గంలో, రాష్ట్రంలో బీజేపీ ఆడుతున్న డ్రామాను పట్టించుకోవద్దని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్న యాత్రకు దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలనే ఎలాంటి ఉద్దేశం మాకు లేదన్నారు. మతిభ్రమించి మనస్థాపం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకు బాధపడినా, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో నా నియోజకవర్గ ప్రజలకు నా కార్యకర్తలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ.. ఎక్కడ కూడా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవద్దని కోరుతున్నానన్నారు.


Tags:    

Similar News