పిడుగుపాటుకు రైతు మృతి, మరొకరికి గాయాలు !
నిన్నటి వరకూ మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో..
సిద్ధిపేట : ఆకాశం మేఘావృతమై.. వర్షం వచ్చేలా ఉండటంతో.. వడ్లు తడవకుండా వాటిపై కవరు కప్పేందుకు వెళ్లిన రైతును పిడుగు బలితీసుకుంది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఉదయం 3 గంటలకు దుబ్బాక మండలం పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లేంగడ్డ గ్రామానికి చెందిన సౌడు పోచయ్య (65) రోడ్డు పై పోసిన వడ్లు వర్షానికి తడవకుండా కవరు కప్పేందుకు వెళ్లాడు. వడ్లపై కవరును కప్పుతుండగా.. ఒక్కసారిగా పిడుగు పడటంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పక్కనే ఉన్న రెడ్డబోయిన కొండయ్య (60) తీవ్రగాయాలపాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నిన్నటి వరకూ మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో.. రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. భారీ వృక్షాలు నేలకూడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం చల్లబడినా.. భారీ వర్షం సృష్టించిన బీభత్సంతో నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు.