Harish Rao : రాజీనామాలు నాకు కొత్తేమీ కాదే
తమకు రాజీనామాలు కొత్త కాదని, రాజీనామా లేఖ ఎలా రాయాలో తనకు తెలుసునని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తమకు రాజీనామాలు కొత్త కాదని, రాజీనామా లేఖ ఎలా రాయాలో తనకు తెలుసునని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముందు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని తాము కోరడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నిజంగా ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు రాజీనామా లేఖ రాయడం చేతకాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, గతంలో ఎన్నిమార్లు తాను రాజీనామా చేశోనో తెలుసా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలవడానికే...
పార్లమెంటు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చుకుంటూ వెళుతున్నారన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని శాసనసభ ఎన్నికలకు ముందు చెప్పి ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. దేవుడి మీద ఒట్టు వేస్తూ ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఈసారి కాంగ్రెసోళ్ల ఒట్లకు, హామీలకు జనం నమ్మరంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాను రాజీనామా చేయడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.