ఆ కామెంట్‌కు.. నేటి వేడుకలే సమాధానం
తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తన వెంటే ఉన్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం
తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తన వెంటే ఉన్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తనను ఆహ్వానించిందా లేదా అనే అంశంపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. ''ఆహ్వానం వచ్చిందా లేదా అనే దానిపై నేను వ్యాఖ్యానించను. నేను తెలంగాణ ప్రజలతో ఉన్నాను, తెలంగాణ ప్రజలు కూడా నాతో ఉన్నారు. నేను వారితో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాను'' అని రాజ్‌భవన్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ప్రధాన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయ ప్రారంభోత్సవం, 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సహా పలు కీలక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తనను ఆహ్వానించడం లేదని గవర్నర్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. 1969లో తెలంగాణ కోసం పోరాడిన వారిని తాను ఆహ్వానించానని, వారితో కలిసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నానని, వారిని సత్కరించడం గర్వంగా ఉందని తమిళిసై అన్నారు.
గవర్నర్ పదవి కేవలం అలంకారమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యపై ప్రశ్నించగా.. “నేటి వేడుకలే సమాధానం” అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. "ప్రజలు చాలా ఆప్యాయంగా పాల్గొన్నారు. ప్రజల కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని ఆమె అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, వారి ప్రేమ, ఆప్యాయతలతో తాను పొంగిపోయానని తమిళిసై తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలను చూసి తన హృదయం ఉప్పొంగిపోయిందని ఆమె పేర్కొన్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ఆమె తెలిపారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె తెలుగులో ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నందున దానికి ప్రత్యేక స్థానం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది అహింసాయుత ఉద్యమమని ఆమె గుర్తు చేస్తూ తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పించారు. 1969లో జరిగిన ఆందోళనలో 300 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారని, మొదటి దశ ఉద్యమంలో పాల్గొన్న వారిలో కొందరిని సన్మానించడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.