హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోండి : హెచ్ సీయూ వీసీ
యూనివర్శిటీ హాస్టల్ లో ఉంటోన్న విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నింటినీ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ప్రతి నిత్యం వేల సంఖ్యలో నమోదవుతున్న కొత్తకేసులు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లకు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలు సైతం ఇదే బాటలో నడిచాయి. ఈ నెలాఖరు వరకూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కానీ.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బీజే రావు విద్యార్థులకు కీలక విజ్ఞప్తి చేశారు.
యూనివర్శిటీ హాస్టల్ లో ఉంటోన్న విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నింటినీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని బీజే రావు వెల్లడించారు. కోవిడ్ బాధితులను ఐసోలేట్ చేసేందుకు వర్శిటీలో వసతులు చాలా పరిమితంగా ఉన్నాయని, పెరుగుతున్న కేసులతో యూనివర్శిటీ వైద్యులపైనా ఒత్తిడి పెరుగుతోందన్నారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులు, సిబ్బంది యూనివర్సిటీ ఫార్మసీలో అందుబాటులో ఉన్న కిట్ల ద్వారా లేదా బయట కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు క్యాంపస్ విడిచి స్వస్థలాలకు వెళ్లిపోవడమే మంచిదని వీసీ అభిప్రాయపడ్డారు.